ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు

ఉప రాష్ట్రపతి అభ్యర్థి కోసం ప్రముఖుల పేర్లతో జాబితా. ఒకరిని మించి ఒకరిపై అంచనాలు. నామినేషన్లకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ. కానీ, అసలు ఈ జాబితాలో లేను.. నాకీ పదవి వద్దు అన్న వెంకయ్యనాయుడు (68) పేరును సోమవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ధారించింది. దాదాపు గంటసేపు జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మొదట్నుంచీ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వెంకయ్య శిరసావహించారని అమిత్‌ షా ప్రశంసించారు. అందుకే వెంకయ్యను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా సీనియర్‌ రాజకీయవేత్తగా వెంకయ్యనాయుడుకు మంచి పేరుందన్నారు. పలువురి పేర్లు చర్చకు వచ్చినా వెంకయ్యను మించిన వ్యక్తి ఎవరూ లేరని పార్లమెంటరీ బోర్డు అభిప్రాయపడిందన్నారు. విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని ఎదుర్కొనేందుకు రాజకీయ, పరిపాలన రంగాల్లో విశేష అనుభవమున్న వెంకయ్యే సరైన వ్యక్తి అని పార్టీ భావించినట్లు షా వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో వెంకయ్య సమాచార, ప్రసారశాఖతోపాటు గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీలోనూ కీలక వ్యక్తిగా ఉన్నారు.

వెంకయ్యపై ప్రశంసలు
ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తూ.. వెంకయ్యపై అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు. ‘పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన వెంకయ్య శ్రమజీవి. రైతుకుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు’అని షా తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాలన్నీ ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలనుకున్నాయని.. అయితే ఎన్డీయే అభ్యర్థిని ప్రకటించటం ఆలస్యం అవటంతోనే విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయన్నారు. ‘అన్ని రాజకీయ పార్టీల్లోని అత్యంత సీనియర్‌ నేతల్లో వెంకయ్యనాయుడు ఒకరనేది వాస్తవం. ఆయనకున్న అపార అనుభవం రాజ్యసభ సజావుగా నడిపించటంలో ఉపయోగపడుతుంది’అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వెంకయ్య నామినేషన్‌ వేయయనున్నట్లు షా తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న వెంకయ్య పార్టీతోపాటు ప్రభుత్వ పదవులకు రాజీనామా చేయనున్నారు.

దక్షిణంలో పాగా కోసమే!
దక్షిణ భారతదేశంలో పార్టీని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తికే ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని బీజేపీ అధిష్టానం కొంతకాలంగా భావిస్తోంది. ఇందులో భాగంగానే వెంకయ్య పేరుపై చర్చించి ఖరారు చేసింది. కర్ణాటక నుంచి మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్య దక్షిణభారతంలో పార్టీకి ముఖ్యనేతగా ఉన్నారు. దీనికి తోడు వెంకయ్యను ఎంపిక చేయటం ద్వారా తెలుగువ్యక్తికి సరైన గౌరవం ఇచ్చినట్లు ఏపీ ప్రజలకు సంకేతాలివ్వాలని బీజేపీ అధిష్టానం భావించినట్లు సమాచారం. ఆగస్టు 5న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉభయసభలకు చెందిన ఎంపీలు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 18 విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న గోపాలకృష్ణ గాంధీతో వెంకయ్య పోటీ పడనన్నారు. అయితే ఎన్డీయే పక్షాలకు బలమైన మద్దతున్న కారణంగా వెంకయ్య ఎంపిక లాంఛనమేనని రాజకీయ వర్గాలంటున్నాయి. తమిళనాడులోని పన్నీర్‌ సెల్వం వర్గం ఏఐఏడీఎంకే వెంకయ్యకు తమ మద్దతు ప్రకటించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. వెంకయ్యకు అభినందనలు తెలిపారు.

గెలిస్తే మూడో తెలుగు వ్యక్తి!
వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిస్తే ఆ పదవి చేపట్టిన మూడో తెలుగు వ్యక్తి అవుతారు. ఇదివరకు తెలుగువారైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (1952–1962), వీవీ గిరి (1967–1969) ఈ పదవి నిర్వహించారు. తర్వాత వీరిద్దరూ రాష్ట్రపతులు కూడా అయ్యారు. రాధాకృష్ణన్‌ నాటి మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని తిరుత్తణి సమీపంలో ఉన్న ఓ గ్రామంలో తెలుగు కుటుంబంలో జన్మించారు. గిరి ప్రస్తుత ఒడిశాలోని బరంపురం (బ్రహ్మపుర్‌)లో పుట్టారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *