విషాదం: తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన నటి, దర్శకురాలు విజయ నిర్మల

ఓ సినీ దిగ్గజం దివికెగిసింది. ఇక సెలవంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. యాక్టర్ గా , దర్శకురాలిగా, ప్రొడ్యూసర్ గా మంచి పేరుతెచ్చుకున్న విజయనిర్మల…రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

విజయనిర్మల తండ్రిది చెన్నై కాగా, తల్లి గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారు. 20 ఫిబ్రవరి 1946లో జన్మించిన విజయనిర్మల 1950లో మత్య్సరేఖ అనే తమిళ చిత్రం ద్వారా బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటికి ఆమెకు ఏడేళ్లు. పదకొండేళ్ల వయసులో ‘పాండురంగ మహత్యం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. ‘రంగులరాట్నం’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన విజయనిర్మల దాదాపు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు.

పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, కురుక్షేత్రం, తదితర చిత్రాల్లో నటించారు. ‘పెళ్లి కానుక’ సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు.

ప్రపంచంలోనే అత్యధికంగా 44చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. తొలిసారి ఆమె ‘మీనా’ అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించగా.. అప్పటి నుంచి 2009 వరకూ మొత్తం 44 సినిమాలు తీశారు.

దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమాహేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు.

విజయనిర్మల మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు సీనియర్ నరేశ్ ఆమె కుమారుడే. విజయనిర్మల మృతి వార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *