యాంకర్ సుమను మామూలుగా ఇరికించలేదు…

అబద్ధాలు బాగా ఆడటం వస్తే మంచి రచయిత కావొచ్చంటూ తీర్మానించేశారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. తాను పెద్ద రచయిత కావడానికి కూడా అదే కారణమని ఆయన చెప్పడం విశేషం. ఈ అబద్ధాలకు.. రచనకు ఉన్న లింకేంటో ఆయన ‘శ్రీవల్లీ’ ఆడియో వేడుకలో తనదైన శైలిలో చెప్పారు.

‘‘చాలామంది నా దగ్గరికి వచ్చి కథలు రాయడం ఎలా అని అడుగుతుంటారు. అలాగే ఒకసారి 21 ఏళ్ల కుర్రాడు వచ్చి అడిగాడు. అతణ్ని నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగాను. ఆ ప్రయత్నంలోనే ఉన్నట్లు చెప్పాడు. ముందు ఒక గర్ల్ ఫ్రెండును సంపాదించమని చెప్పాను. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని పడేయమన్నాను. అలా చేయగలిగితే ఏడాది తిరిగాక నువ్వు మర్డర్ అయిపోవచ్చు. అలా కాని పక్షంలో గొప్ప రచయిత అయిపోవచ్చు. ఎందుకంటే అబద్ధాలు బాగా ఆడగలిగితే రచనలో పట్టు సంపాదించవచ్చు. ఎందుకంటే ఒక కథ అంటే అబద్ధం. ఎన్ని అబద్ధాలాడితే అన్ని కథలు రాయొచ్చు’’ అని తీర్మానించారు విజయేంద్ర.

ఈ అబద్ధాల గురించి మాట్లాడుతూ యాంకర్ సుమను భలేగా ఇరికించారు విజయేంద్ర. ‘‘నన్ను కథలు ఎలా రాయాలో అడిగిన కుర్రాడు ఏడాది తర్వాత కనిపించడం మానేశాడు. నేను యాభై ఏళ్లుగా విజయవంతమైన రచయితగా కొనసాగుతున్నానంటే ఎంతటి అబద్ధాల కోరునో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల కిందట వారం వ్యవధిలో బాహుబలి.. భజరంగి భాయిజాన్ సినిమాలు రిలీజై గొప్ప విజయం సాధించాయి. అబద్ధాలు ఆడటంలో నన్ను మించిన వాడు లేడనుకున్నా. అందరూ నా కంటే వెనకే ఉన్నారనుకున్నా. కానీ తర్వాత చూస్తే నా కంటే కిలోమీటరు ముందు ఒక వ్యక్తి కనిపించారు. ఆ వ్యక్తికి మలయాళం వచ్చు’’ అంటూ సుమ వైపు చూపించారు విజయేంద్ర. ఆడియో వేడుకల్లో ఆమె బోలెడన్ని అబద్ధాలాడుతుందని.. వేడుకకు వచ్చిన అతిథులందరినీ ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడేస్తుందని.. సినిమా గురించి కూడా లేనిపోని అబద్ధాలు చెబుతుందని అంటూ విజయేంద్ర ప్రసాద్ సుమను భలేగా ఇరికించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *