ఆసియా కప్‌:కోహ్లికి రెస్ట్‌.. రోహిత్‌కు పగ్గాలు.. ధావన్‌కు ప్రమోషన్‌

ఈ నెల 15 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. భవిష్యత్‌ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. వరుస సిరీస్‌లతో పాటు, అధిక బ్యాటింగ్‌ భారం మోస్తున్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి విశ్రాంతి నిచ్చిన సెలక్షన్‌ కమిటీ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలక్షన్‌ కమిటీ. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించింది.

కోహ్లి గైర్హాజర్‌తో మిడిల్‌ ఆర్డర్‌ బలం పరీక్షించేందుకు చాలా రోజులు తర్వాత హైదరాబాద్‌ ఆటగాడు అంబటి రాయుడుకి అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకున్న మరో ఆటగాడు కేదార్‌ జాదవ్‌ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోనికి బ్యాకప్‌గా రిషబ్‌ పంత్‌ను కాదని మరో సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. బ్యాట్స్‌మెన్‌ మనీశ్‌ పాండే, కేఎల్‌ రాహుల్‌లకు మరో అవకాశం కల్పించారు.

ఖలీల్‌ అహ్మద్‌కు అవకాశం
రంజీ మ్యాచ్‌ల్లో నిలకడగా రాణిస్తున్న రాజస్థాన్‌ ఆటగాడు, లెఫ్టార్మ్‌ మీడియం పేస్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌కు సెలక్టర్లు జట్టులో చోటు కల్పించారు. గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌ తిరిగి జట్టులోకి చేరాడు. స్పిన్నర్లు అశ్విన్‌-జడేజాలకు మరోసారి నిరాశే ఎదురైంది. బౌలింగ్‌ విభాగంలో ప్రయోగాల జోలికి సెలక్టర్లు వెళ్లలేదు.

టీమిండియా జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు, మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌, అక్షర్‌ పటేల్‌, శార్దుల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌, జస్ప్రిత్‌ బుమ్రా

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *