కళాతపస్వి కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

ప్రముఖ దర్శకుడు, నటుడు కళాతపస్వి కే విశ్వనాథ్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి వచ్చిచేరింది. భారత ప్రభుత్వం సినీరంగానికి విశిష్ట సేవలందించినవారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయనను ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద స్వర్ణకమలం, పది లక్షల నగదు అందజేస్తారు. మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా విశ్వనాథ్ అవార్డును అందుకుంటారు. 2016 సంవత్సరానికి విశ్వనాథ్ పేరును సూచిస్తూ దాదాసాహెబ్ ఫాల్కే కమిటీ చేసిన సిఫారసుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రి ఎం వెంకయ్యనాయుడు సోమవారం ఆమోదం తెలిపారు. కళాత్మక చిత్రాల దర్శకునిగా విశ్వనాథ్‌కు గొప్ప పేరుంది. శంకరాభరణం, సాగరసంగమం, సిరివెన్నెల, స్వాతిము త్యం, స్వాతికిరణం వంటి సంగీత, నృత్య ప్రధాన చిత్రాలతో ఆయన దేశవిదేశాల్లో ఖ్యాతిని గడించారు. 1930 లో జన్మించిన కాశీనాథుని విశ్వనాథ్ 1965 నుంచి సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 50 చిత్రాలను ఆయన రూపొందించారు. పాత్రోచిత సంభాషణ, సహజత్వం ఉట్టిపడే కెమెరా పనితనం, అన్నీటికి మించి వీనుల విందైన సంగీతం ఆయన సినిమాల ప్రత్యేకత.

సామాజిక సమస్యలకు సంగీత నాట్యాలను మేళవించి ఆయన తీసిన సినిమాలు అనితరసాధ్యం. అన్నీ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలు కావడం మరో విశేషం. కథాకథనాలు ఏవైనా మనిషిలోని మంచితనానికి పట్టం కట్టాలన్నదే ఆయన లక్ష్యం. సినిమాల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన సినిమాలకు 5 జాతీయ బహుమతులు, 20 నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. ఫిలింఫేర్ జీవనసాఫల్య పురస్కారం కూడా విశ్వనాథ్ అందుకున్నారు. 59వ ఆస్కార్ అవార్డులకు ఆయన తీసిన స్వాతిముత్యం విదేశీ చిత్రాల క్యాటగిరీలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా నమోదైంది.

విశ్వనాథ్‌కు గవర్నర్ అభినందనలు

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎంపికైన కళాతపస్వీ కే విశ్వనాథ్‌కు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందనలు తెలిపారు. దక్షిణ భారత చలనచిత్ర రంగానికి, ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన అమోఘమైన సేవ చేశారని కొనియాడారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేయడమే విశ్వనాథ్ సినిమా రంగానికి చేసిన సేవకు నిజమైన గుర్తింపు అన్నారు. శంకరాభరణం, సాగరసంగమం, సప్తపది వంటి సినిమాలు తీసిన కాలం తెలుగు సినిమారంగానికి స్వర్ణయుగమని ప్రశంసించారు. ఈ సినిమాలతో సంప్రదాయ నృత్యం, సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారని అన్నారు.

సంపూర్ణంగా అర్హుడు.. విశ్వనాథ్‌కు సీఎం ప్రశంస

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. కేవలం తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా భారతీయ సినిమాకు గొప్ప గౌరవం తెచ్చిపెట్టిన విశ్వనాథ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు సంపూర్ణంగా అర్హుడని ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. భారతీయ సంగీత, నృత్యకళకు, సంప్రదాయాలకు అద్దంపట్టి, వాటి ఔన్నత్యాన్ని పెంచే చిత్రాలు రూపొందించి ఉత్తమాభిరుచిని చాటుకున్న విశ్వనాథ్.. భావితరాలకు ఆదర్శమని సీఎం ప్రశంసించారు.

విశ్వనాథుడి గురించి ఆ నలుగురు ఏమన్నారు?

ఆ నాలుగింటిలో ఒకటి, శంకరాభారణం శతదినోత్సవ వేడుకల్లో నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ నేను సాధారణంగా ఎవరికీ మనస్ఫూర్తిగా తలవంచి ప్రణామం చేయను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తికి తప్ప. కానీ ఇంకొకరికి కూడా శిరసు వంచి వందనం చేస్తాను. వారు శ్రీ కే విశ్వనాథ్ అన్నారట. అదీ విశ్వనాథ్‌గారు సంపాదించుకున్న అరుదైన అభిమానం. తొంభైల చివరలో హృతిక్ రోషన్ మానియా దేశాన్ని ఊపేస్తున్నప్పుడు ఆయన రెండో సినిమా ఎవరితో అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన తండ్రి, నటుడు, నిర్మాత అయిన రాకేశ్ రోషన్ సమాధానమిస్తూ కే విశ్వనాథ్ ఒప్పుకుంటే మా అబ్బాయి రెండో సినిమా వారితోనే ఉంటుంది అన్నారట. మూడోది మణిరత్నం వంటి దర్శకుడికి అర్ధాంగి, నటి కూడా అయిన సుహాసిని ఒక ఇంటర్వ్యూలో తనకు కే విశ్వనాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయలేదన్న బాధ ఉండిపోయింది అన్నారట. ఇక చివరిది, ఏఆర్ రెహమాన్. తనకు విశ్వనాథ్ వద్ద సంగీత దర్శకత్వం చేయలేదే అన్న అసంతృప్తి వెంటాడుతున్నదని ఆయన ఒకసారి వేటూరి వద్ద అన్నారట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *