యోగి.. యూపీ సీఎం ఎలా అయ్యారు?

న్యూఢిల్లీ: మీడియా అంచనాలను తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎంపిక చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. సొంత పార్టీ సీనియర్ నేతలు కూడా ఆదిత్యనాథ్ ను ఎంపిక చేస్తారని ఊహించలేదు. ఆయన ఎంపికలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం కూడా లేదని సమాచారం. మరి ‘గోరఖ్ పూర్ సన్యాసి’ని యూపీ సీఎంగా ఎంపిక చేయడానికి కారణాలు ఏంటి?

ప్రజాదరణ, రాజకీయంగా నిబద్దత, నిరాడంబరత, ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన చూపిన క్రమశిక్షణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆదిత్యనాథ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. యూపీలో బీజేపీ నిర్వహించిన ప్రతి సర్వేలోనూ ఆదిత్యనాథ్ కు మంచి మార్కులు రావడంతో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గుచూపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజ్‌ నాథ్ సింగ్ తర్వాత స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పట్ల రాజ్ నాథ్ సింగ్ విముఖత వ్యక్తం చేయడంతో ఆయన తర్వాత స్థానంలో ఉన్న ఆదిత్యనాథ్ ను అదృష్టం వరించింది. యూపీ ఓటర్లు కమలం పార్టీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంతో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ ధైర్యంగా నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల ప్రచారంలో స్టార్ కాంపెయినర్ గా ఉన్న ఆదిత్యనాథ్ చూపిన స్వయం క్రమశిక్షణ కూడా పార్టీ పెద్దలను ఆకట్టుకుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఏడో దశ ఎన్నికల్లో ఆయన ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు. తన సొంత నియోజకవర్గం గోరఖ్‌ పూర్ లో పెద్ద ఎత్తున పోటీ చేసిన తిరుగుబాటు అభ్యర్థులను ఓడించడానికి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారని, ఆయనలా మరొకరు కష్టపడలేదని తెలిపారు. ముక్కుసూటిగా మాట్లాడడం, నిరాడంబర జీవితం గడిపే ఆదిత్యనాథ్ వ్యక్తిత్వం అమిత్ షాను ఎంతో ఆకట్టుకుందని మరో బీజేపీ నాయకుడు వెల్లడించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *