మలేసియా పర్యాటనకు వీసా లేకుండా

కొత్త ఏడాది విదేశాల్లో చక్కర్లు కొట్టాలని ఉందా? అయితే, మలేసియా మిమ్మల్ని సగర్వంగా ఆహ్వానిస్తోంది. 2020 సందర్భంగా ఏడాది మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దేశాన్ని చుట్టేయవచ్చు. ఇండియా, చైనా ట్రావెలర్స్ కోసమే ఆ దేశం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే. విదేశీ ప్రయాణమంటే పాస్‌పోర్ట్‌, వీసా కూడా చాలా అవసరం. చాలామంది విదేశాలు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నా.. చివరి క్షణంలో విసా సమస్య వల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ ఏడాది మలేసియా వెళ్లేందుకు ఆ సమస్యలు రావు. ఎందుకంటే.. 2020లో ఆ దేశాన్ని సందర్శించే ప్రయాణికులకు వీసా అక్కర్లేదు. ఈ ఏడాదిలో 15 రోజులు ఆ దేశాన్ని చుట్టి వచ్చేయవచ్చు. ఎలక్ట్రానిక్ ట్రావెల్ రిజిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ ద్వారా మలేసియాలో పర్యటించవచ్చు స్టార్ ఆన్‌లైన్ రిపోర్టు ప్రకారం.. వీసా అవసరం లేకుండా ప్రయాణించే పర్యాటకులు తగిన గుర్తింపు కార్డులు చూపించాలి. ఆ దేశంలో ఖర్చుల కోసం తగిన నగదు ఉన్నట్లుగా ఆధారాలు ఇవ్వాలి. మలేషియా ఎందుకు వెళ్తున్నారనేది స్పష్టంగా తెలియజేయాలి. రిటర్న్ టికెట్ కూడా చూపించాలి. రిజిస్టర్ చేసుకున్న మూడు నెలల తర్వాత పర్యాటనకు అనుమతి ఇస్తారు. అయితే, 15 రోజుల తర్వాత టూర్‌ను పొడిగించుకోవడానికి అనుమతి ఉండదు. 2020లో విదేశీ పర్యాటకుల సంఖ్య 30 మిలియన్‌కు చేరాలనేది ఆ దేశం లక్ష్యం. ఈ నేపథ్యంలో జనాభా ఎక్కువగా ఇండియా, చైనాలను లక్ష్యంగా చేసుకుని ఈ మలేసియా ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరి, ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిద్ధమైపోండి. ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే.. సమ్మర్ హాలీడేస్ కల్లా మీకు అనుమతి వచ్చేస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *