నిన్న, నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

వేతన సవరణతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బ్యాంకు ఉద్యోగసంఘాలు చేపట్టిన సమ్మెతో ఎక్కడిక్కడ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోజువారి వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం బ్యాంకులపైన ఆధారపడిన వ్యాపారవర్గాలు సైతం ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె సమాచారం తెలియకపోవడంతో చాలామంది ఖాతాదారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు వచ్చి నిస్సహాయంగా తిరిగి వెళ్లారు. మరోవైపు ప్రైవేట్‌ బ్యాంకులు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు యథావిధిగా కొనసాగాయి. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ తెలుగు రాష్ట్రాల విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల సమ్మెకు పిలుపున్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజు బ్యాంకు ఉద్యోగులు అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. అబిడ్స్, బ్యాంక్‌ స్ట్రీట్‌లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన సభలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తూ లాభాలు లేవనే నెపంతో ఉద్యోగులకు వేతన సవరణ చేయకపోవడం అన్యాయమన్నారు. కార్పొరేట్‌ సంస్థలు ఎగవేసిన వేల కోట్ల రూపాయలను తిరిగి వసూలు చేయకపోవడం దారుణమన్నారు.సమ్మెలో స్టేట్‌బ్యాంకు, ఆంధ్రాబ్యాంకులతో పాటు అన్ని జాతీయ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు, అధికారులు పాల్గొంటుండగా, గ్రామీణ వికాస బ్యాంకు, డీసీసీబీ, ప్రైవేటు బ్యాంకులు సమ్మెకు దూరంగా ఉంటున్నాయి. రెండురోజుల సమ్మెకు ప్రభుత్వం దిగి రాకపోతే వచ్చే నెలలో 11, 12, 13 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు సమ్మెలోకి వెళ్లనున్నామని, అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లేందుకు వెనుకాడబోమని బ్యాంకు సంఘాల ఉమ్మడి వేదిక(యూఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్‌ కె.సిహెచ్‌.వెంకటరమణ, బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసులు స్పష్టం చేశారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *