7 గంటల కంటే తక్కువగా నిద్రపోతే కలిగే ఏడు ప్రమాదాలు!

టెక్నాలజీ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో, అంతే హాని చేస్తుందనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా యువత సోషల్ మీడియాకు అలవాటు పడి నిద్రకు కూడా దూరమవుతున్నారు. ఉద్యోగులు కూడా నెట్‌కు బానిసలుగా మారుతున్నారు. కారణాలు ఏవైనప్పటికీ నిద్రలేమి ఇప్పుడు చాలామందిని వేధిస్తోన్న ప్రధాన సమస్య. రాత్రి 2 గంటల వరకూ నెట్‌లో గడుపుతూ, ఫోన్‌లో సినిమాలు చూసుకుంటూ గడిపేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
 
మళ్లీ ఉదయాన్నే 7 గంటలకు నిద్ర లేచి హడావుడిగా ఆఫీస్‌కు రెడీ అవుతుంటారు. అలాంటి వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. యువత కనీసం 7 నుంచి 9 గంటలు, టీనేజర్స్ 8నుంచి 10 గంటలు, చిన్నపిల్లలు 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. యువత రాత్రుళ్లు నిద్రను దూరం చేసుకుంటూ, ఏడు గంటల నిద్రకు దూరమవ్వడం వల్ల ప్రధానంగా ఏడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది. అవేంటో తెలుసుకుందాం.
1. ఒక్కరోజు నిద్ర దూరమవడం వల్ల మరుసటి రోజు విపరీతమైన ఆకలితో అతిగా తింటున్నారని, దీంతో బరువు పెరిగి ఊబకాయంతో బాధపడుతున్నారని అప్స్ల యూనివర్సిటీ సర్వేలో తేలింది.
2. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల చర్మ సంబంధ సమస్యలు వేధిస్తున్నట్లు తెలిసింది. చర్మంపై ముడతలు, కళ్ల కింద మచ్చలు ఇలాంటి వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని సర్వే వెల్లడించింది.
3. సరిపడినంత నిద్ర లేకపోవడం వల్ల మెదడు ఆలోచించే శక్తిని క్రమంగా కోల్పోతుందని సర్వే వెల్లడించింది. దానివల్ల మతిమరుపు పెరుగుతోంది. దాని పర్యవసానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
4. ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోతే కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు ఎదురవుతాయట. 2002లో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ, మెటాబాలిజమ్‌లో ప్రచురితమైన కథనం ఈ విషయాన్ని నిజం చేస్తోంది. తక్కువగా నిద్రపోయే మగవారిలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతాయని, శృంగార ఆస్వాదనలో దాని ప్రభావం అధికంగా ఉంటుందని సర్వే వెల్లడించింది.
5. రోగనిరోధక శక్తి తగ్గడం: నిద్రలేమి వల్ల జలుబు చేసినా తట్టుకోలేని విధంగా తయారవుతారని సర్వేలో తేలింది. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
6. రక్తపోటు ప్రభావం అధికంగా ఉండటం: ఆరేడు గంటల కంటే తక్కువగా నిద్రపోతే రక్తపోటు పెరిగి గుండె సంబంధిత సమస్యలతో బాధపడక తప్పదని సూచిస్తున్నారు. హార్ట్ స్ట్రోక్స్ వల్ల చనిపోయే వారిలో ఇలాంటి వారే ఎక్కువని సర్వేలో తేలింది.
7. మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం: నిద్రలేమి వల్ల అనేక మానసిక సమస్యలు మనుషులను చుట్టుముడతాయని సర్వే ఫలితాల్లో తెలిసింది. మానసిక ఒత్తిడి ఆలోచన శక్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని సర్వే వెల్లడించింది. ప్రశాంతత కరువై నిద్రలేని రాత్రులు గడపడానికి అలవాటు పడే ప్రమాదముందని సర్వేలో తేలింది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *