అమెజాన్‌ను ముంచేయ‌డం చాలా తేలిక‌..అని నిరూపించాడు

అమెజాన్‌ను ముంచేయ‌డం చాలా తేలిక‌..అని నిరూపించాడు ఓ యువ‌కుడు అనేది ఇప్పుడు దేశ వ్యాపార స‌ర్కిల్‌లోసాగుతున్న చ‌ర్చ‌. అది కూడా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.50 ల‌క్ష‌లు బొక్క‌ప‌డేలా చేశాడు ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడు. రెండు నెలల వ్యవధిలోనే అమెజాన్‌కు రూ. 50 లక్షల నష్టం కలిగించాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 166 ఫోన్లను బుక్ చేసి.. డబ్బును రిఫండ్ చేయించుకున్నాడు. త‌ద్వారా  అమెజాన్ సంస్థను భారీ ఎత్తున బ‌క్రా చేసేశాడు.

హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన శివమ్ చోప్రా(21) అనే ఢిల్లీ వాసి చేసిన కోర్సులో సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఉద్యోగం సంపాదించలేకపోయాడు. దీంతో అక్రమంగా డబ్బు సంపాదించే మార్గాన్ని చోప్రా ఎంచుకున్నాడు. ఆన్‌లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ నుంచి రెండు ఫోన్లు ఆర్డర్ చేశాడు. ఆ ఫోన్లను తీసుకుని.. తనకు ఖాళీ డబ్బాలు మాత్రమే వచ్చాయని తిరిగి అమెజాన్ సంస్థకు ఫిర్యాదు చేసేవాడు. దీంతో రిఫండ్ కోరగా, డబ్బులు శివమ్ ఖాతాలో జమ అయ్యాయి. ఇలా ఆపిల్, శాంసంగ్, వన్ ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల హైఎండ్ ఫోన్లకు వేర్వేరు ఫోన్ నెంబర్లు, చిరునామాలతో ఆర్డర్స్ ఇచ్చేవాడు. ఈ ఎపిసోడ్‌లో శివమ్‌కు సిమ్ కార్డులు సరఫరా చేసేందుకు సచిన్ జైన్ అనే చిన్న టెలికం స్టోర్ ఓనర్ సహకరించాడు. 141 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులను శివమ్‌కు సచిన్ ఇచ్చాడు. ఈ నెంబర్లను ఉపయోగిస్తూ ఫోన్లను శివమ్ కొనేవాడు. ఇలా తప్పుడు చిరునామాలతో రెండు నెలల్లో 166 ఫోన్లకు ఆర్డరిచ్చాడు.

ఆ త‌ర్వాతే మ‌నోడి ఆప‌రేష‌న్ ప్రారంభం అయ్యేది. ఫోన్‌ను డెలివరీ చేసేందుకు వచ్చే బాయ్, ఆ అడ్రస్‌లో లేరని తెలుసుకుని కాల్ చేయగా, దగ్గర్లోనే మరో చోట ఉన్నానని చెప్పేవాడు శివమ్. రెండుమూడు సందులు తిప్పి.. ఫలానా చోటకు రావాలని డెలివరీ బాయ్‌కు శివమ్ సూచించేవాడు. మొత్తానికి ఫోన్ డెలివరీ అయిన కాసేపటికే కొత్త నాటకానికి తెరలేపే వాడు. అప్పటికే డబ్బులు కట్టిన శివమ్.. తనకు ఖాళీ డబ్బానే వచ్చిందని అమెజాన్ సంస్థకు ఫిర్యాదు చేసేవాడు. తన డబ్బులు రిఫండ్ చేయాలని కోరగా.. సంస్థ వారు కూడా ఇతని ఖాతాలో డబ్బును జమ చేసేవారు.

ఇలా రెండు నెలల వ్యవధిలో 166 ఫోన్లకు ఆర్డరిచ్చి రూ. 50 ల‌క్ష‌ల‌ మోసం చేశాడు. ఎక్క‌డో తేడా కొడుతోంద‌ని గ‌మ‌నించిన అమెజాన్ త‌ర్వాత మేలుకుంది. పోలీసులను ఆశ్ర‌యించింది. అమెజాన్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. శివమ్ నుంచి 19 మొబైల్ ఫోన్లు, రూ. 12 లక్షల నగదు, 40 పాస్‌బుక్‌లు, చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మ‌నోడు నిజం ఒప్పుకొని క‌ట‌క‌టాల వెన‌క ఉన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *