వందల మంది ఉద్యోగులను తీసేస్తున్న అమెజాన్‌

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా తన ఉద్యోగులపై వేటు వేస్తోంది. వందల మంది ఉద్యోగులను అమెజాన్‌ తొలగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఎక్కువ లేఆఫ్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం సీటెల్‌లో ఉన్నట్టు పేర్కొన్నాయి. గ్లోబల్‌ వ్యాపారాలలో కూడా వందల మందిని తొలగిస్తుందని  తెలిపాయి. ఉద్యోగులను తొలగించే ప్రక్రియ కొన్ని వారాల క్రితమే ప్రారంభమైందని తెలిసింది. ఎక్కువగా వృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో కొత్త ఉద్యోగులను నియమించుకుంటూ.. పాత రిటైల్‌ బిజినెస్‌ ఉద్యోగులపై అమెజాన్‌ వేటు వేస్తున్నట్టు వెల్లడవుతోంది.

”తమ వార్షిక ప్రణాళిక ప్రక్రియలో భాగంగా.. కంపెనీ అంతటా ఉద్యోగుల కార్యనిర్వాహక సర్దుబాట్లు చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులను తగ్గించి, మరికొన్ని ప్రాంతాల్లో కొత్తవారిని నియమించుకుంటున్నాం” అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే మొత్తంగా మాత్రం కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లేదని తెలిపింది.

ఇటీవల కాలంలో కూడా అమెజాన్‌ ఉద్యోగ నియామకాలను బాగానే చేపట్టింది. గత ఏడాది కంపెనీ లక్షా 30వేల మందిని నియమించుకుంది. దీంతో 2017 చివరి నాటికి అమెజాన్‌ ఉద్యోగుల సంఖ్య 5 లక్షల 60వేలకు చేరింది. అంతేకాక కంపెనీ నార్త్‌ అమెరికాలో రెండో ప్రధాన కార్యాలయాన్ని తెరబోతుంది. దీనిలో 50వేల మంది ఫుల్‌-టైమ్‌ వర్కర్లను నియమించుకోబోతుంది. వీరిలో ఎక్కువ మంది అ‍త్యధిక వేతనం అందుకునే వారనే తెలిసింది. ప్రస్తుతం కంపెనీ చేపడుతున్న ఈ లేఆఫ్స్‌ ప్రక్రియ, కొత్త ఉద్యోగస్తుల నియామకాలపై ప్రభావం చూపదని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *