టీడీపీకి భారీ షాక్‌ : కాంగ్రెస్‌ గూటికి రేవంత్‌రెడ్డి!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే అనుముల రేవంత్‌ రెడ్డి పార్టీని వీడనున్నట్లు తెలిసింది.

అధికార టీఆర్‌ఎస్‌తో టీటీడీపీ పొత్తు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న రేవంత్‌.. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. గడిచిన కొద్ది గంటలుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన.. కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారని, రెండు మూడు రోజుల్లోనే చేరికకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు కాంగ్రెస్‌కానీ, ఇటు రేవంత్‌గానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.

రాహుల్‌ గాంధీతో భేటీ! : ఢిల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నవంబర్‌ 9న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్‌ సమక్షంలోనే రేవంత్‌ కాంగ్రెస్‌లోకి అధికారికంగా చేరతారని తెలుస్తోంది.

‘టీఆర్‌ఎస్‌తో పొత్తు’తో టీడీపీలో చిచ్చు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ.. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలను కోల్పోయింది. అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయింపుల పర్వం మొదలైనప్పుడు, టీడీపీ పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో ఓటుకు కోట్లు కుట్రను అమలుచేయడం, అదికాస్తా బట్టబయలు కావడం, ఆ తర్వాత మిగిలిన టీడీపీ నేతలంతా టీఆర్‌ఎస్‌లోకి చేరడం.. తదితర పరిణామాలు తెలిసినవే. అయితే మొదటి నుంచి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న రేవంత్‌రెడ్డి.. చివరినిమిషం దాకా అదేబాటను అట్టిపెట్టుకున్నారు. ఓటుకు నోట్లు కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఏ చంద్రబాబు కోసమైతే తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసేందుకు రేవంత్‌ సిద్ధపడ్డరో.. అదే చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్‌తో పొత్తుపెట్టుకోవడానికి సిద్ధం కావడం మిగుండు పడని విషయంలా మారింది. అందుకే రేవంత్‌ కాంగ్రెస్‌లోకి చేరి, టీఆర్‌ఎస్‌పై పోరాటాన్ని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *