నోట్ల రద్దు ముందు డిపాజిట్ల లెక్కలు తీస్తారట

పెద్ద నోట్ల రద్దు పరిణామంలో మరో ఊహించని ఎపిసోడ్. నోట్ల రద్దుకు ముందు అంటే 2016 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 వరకు అయిన డిపాజిట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్  కోరింది. నోట్ల రద్దు వరకు జరిగిన లావాదేవీలను విశ్లేషించడంలో భాగంగా ఐటీ అధికారులు ఈ వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాదు అకౌంట్లు తెరిచే సమయంలో పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) ఫార్మ్ 60 ఇవ్వని కస్టమర్ల నుంచి ఫిబ్రవరి 28లోగా ఆ వివరాలు సేకరించాలని కూడా ఆదేశించింది. పాన్ లేనివాళ్లు ఫార్మ్ 60 డిక్లరేషన్ ఇస్తారు.

ఐటీ శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం.. అన్ని బ్యాంకులు కో ఆపరేటివ్ బ్యాంక్స్- పోస్ట్ ఆఫీసులు ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 వరకు జరిగిన డిపాజిట్ల వివరాలను ఐటీకి అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐటీ చట్టం 114బీ నిబంధన ప్రకారం.. ప్రతి ఖాతాదారుడు అందించిన పాన్ ఫార్మ్ 60తోపాటు అన్ని లావాదేవీల వివరాలు భద్రపరచాల్సి ఉంటుంది. పాన్ కచ్చితంగా ఇవ్వాల్సిన లావాదేవీలన్నీ ఈ 114బీ నిబంధన కింద ఉంటాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు సేవింగ్స్ ఖాతాల్లో రెండున్నర లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు కరెంట్ అకౌంట్లలో పన్నెండున్నర లక్షల కంటే ఎక్కువున్న డిపాజిట్లు వివరాలు ఇవ్వాలని అన్ని బ్యాంకులు పోస్టాఫీస్లకు ఇంతకుముందే ఐటీ శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. ఒకరోజు 50 వేల కంటే ఎక్కువ డిపాజిట్లు అయిన ఖాతాల వివరాలు కూడా అడిగింది. ఇప్పటికే 15 లక్షల కోట్ల డిపాజిట్లు అయిన నేపథ్యంలో డిపాజిట్ల తీరును ఐటీ శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద డిపాజిట్ల వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *