రివ్యూ: దేవి శ్రీ ప్రసాద్ ఎలా ఉంది

ఈ రోజు విడుదలైనవి అన్ని చిన్న సినిమాలే కావడంతో దేనికి వెళ్ళాలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రేక్షకులు. ఏకపక్షంగా ఒకే సినిమావైపు లేకపోవడం విశేషం. మౌత్ టాక్ ని బట్టి, రివ్యూస్ ని బట్టి వీటి జాతకం ఆధారపడి ఉంది. ఈ బ్యాచ్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీ దేవి శ్రీ ప్రసాద్. చాలా టిపికల్ అనిపించే ట్రైలర్ తో ఓ మాదిరి అంచనాలు ఏర్పరుచుకున్న దేవి శ్రీ ప్రసాద్ ప్రీమియర్ షోలు రెండు రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు అఫీషియల్ గా రిలీజ్ అయిపోయింది కాబట్టి సింపుల్ రివ్యూలో ఎలా ఉందో చూద్దాం.

ఇది దేవి, శ్రీ, ప్రసాద్ అనే ముగ్గురు కుర్రాళ్ళ కథ. దేవి(భూపాల్)ఆటో నడుపుతూ పొట్టపోసుకుంటూ ఉంటాడు. శ్రీ(ధన రాజ్)హాస్పిటల్ మార్చురీలో అటెండర్ గా పని చేస్తుంటాడు. ఇక ప్రసాద్(మనోజ్ నందన్)ఒక టీ స్టాల్ ఓనర్. ఈ ముగ్గురికి మంచి ఫ్రెండ్ షిప్ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఊహించని విధంగా సినిమా హీరొయిన్ లీలా(పూజా రామచంద్రన్)వీరికి శవంలా పరిచయమవుతుంది. తన నిస్సహాయ స్థితిని తమ స్వార్థానికి వాడుకోవాలని ముగ్గురు డిసైడ్ అవుతారు. తర్వాత ఏం జరిగింది, అసలు లీలా ఎలాంటి స్థితిలో వీళ్ళను కలిసింది, తను నిజంగా చనిపోయిందా అనేది అసలు కథ

 ఒక కొరియన్ మూవిని స్పూర్తిగా తీసుకుని రాసుకున్న కథతో దర్శకుడు శ్రీ కిషోర్ ఈ కథను తెరకెక్కించాడు. యాక్టర్స్ పరంగా సినిమా మొత్తం స్ట్రెచర్ మీద ఉండే పాత్రలో పూజా జీవించేసింది. తనే సినిమాకు అసలు హై లైట్. కాని వేరియేషన్స్ ఇవ్వడానికి స్కోప్ తక్కువగా ఉండటం వల్ల అంత ఎక్స్ ప్లోర్ కాలేకపోయింది. ధన రాజ్ తర్వాత ప్లేస్ కొట్టేస్తాడు. పోసాని,వేణు జస్ట్ ఓకే కాని సుదర్శన్, అవినాష్ కామెడీ తేడా కొట్టేసింది. తెలుగు నేటివిటీకి ఏ మాత్రం రుచించని కాన్సెప్ట్ తీసుకుని చివర్లో ట్విస్ట్  బాగానే ఇచ్చారు కాని ఈ మధ్యలో తతంగమంతా సాగదీసినట్టు అనిపించడంతో ఫైనల్ గా అవుట్ పుట్ ఇంకోలా వచ్చేసింది.

కాన్సెప్ట్ పరంగా ఇది టాలీవుడ్ లో నిజంగా కొత్తదే కాని దాన్ని సమర్ధవంతంగా తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీ కిషోర్ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఇంటరెస్టింగ్ ప్లాట్ రాసుకున్న కిషోర్ దాన్ని కంప్లీట్ థ్రిల్లర్ గా మార్చకుండా కామెడీ ఉంటేనే ఇలాంటి సినిమాలు వర్క్ అవుట్ అవుతాయి అనే నమ్మకంతో మొత్తానికే మోసం తెచ్చేసాడు. లాజిక్స్ కి దూరంగా ఇలాంటి సినిమాలు చూడాలి అనే మాట నిజమే అయినప్పటికీ బేసిక్స్ కూడా మర్చిపోతే తేడా కొట్టేస్తునది. ఇందులో జరిగింది కూడా అదే. మాస్ ని కూడా బాలన్స్ చేయాలి అనే తాపత్రయంలో కిషోర్ చేసిన తప్పులు ఫైనల్ అవుట్ పుట్ మీద ప్రభావం చూపించాయి. ఎమోషనల్ గా చెప్పాలనుకున్న కంటెంట్ ని మల్టీ యాంగిల్స్ లో చెప్పే ప్రయత్నం చేయటంలో కిషోర్ పట్టాలు తప్పేసాడు. కాని థ్రిల్లర్ మూవీస్ ఎలా ఉన్నా భరిస్తాము, ఇష్టపడతాము అనుకునేవాళ్లు తప్ప మిగిలినవాళ్ళకు కష్టమే. కమ్రాన్ సంగీతం, ఫణింద్ర కెమెరా కొంతమేర కాపాడాయి. ఇది పక్కన పెడితే మిస్ కాకుండా చూడాల్సిన సినిమాగా దేవి శ్రీ ప్రసాద్ నిలవలేకపోయింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *