ట్రంప్ నిర్ణయంతో మనోళ్ల పరిస్థితి ఏంటి?

హెచ్1-బీ వీసాలపై ఆంక్షలు – ఇస్లామిక్ దేశాల నుంచి వలసలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాలు అమలవుతాయో?  లేదో?  తెలియదు కానీ… అక్కడి పరిస్థితులను చూస్తుంటే మాత్రం ఒళ్లు జలదరించక మానదు. సాఫ్ట్ వేర్ రంగంలోని నైపుణ్యాన్ని సాధించిన భారతీయులు – ప్రత్యేకించి తెలుగు యువత ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికా ఫ్లైటెక్కేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రజల సంఖ్య భారీగానే ఉంది. తానా – ఆటా – టాటా తదితర అమెరికాలోని తెలుగు ప్రజల సంఘాల సంఖ్యను చూస్తేనే… అక్కడ మనవాళ్లు ఎంతమంది ఉన్నారో ఇట్టే తెలిసిపోతోంది. ఈ క్రమంలో హెచ్1-బీ వీసా చట్టానికి సవరణ చేస్తూ ట్రంప్ సర్కారు ప్రతిపాదించిన బిల్లుకు ఆమోద ముద్ర పడితే… మనోళ్ల పరిస్థితి ఏమిటి? ఇదే విషయంపై అక్కడి మనవాళ్లు పరిపరి విధాలుగా భయాందోళనలకు గురవుతుండగా ఇక్కడి వారి తల్లిదండ్రులు – ఇతర కుటుంబ సభ్యులు మరింత ఆందోళనలో కూరుకుపోయారు. ట్రంప్ నిర్ణయం దరిమిలా అక్కడి మనవాళ్ల మనోభావాలు ఎలా ఉన్నాయన్న విషయంపై అక్కడి మన తెలుగు సంఘాల నేతలను కదిలిస్తే… పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి.

ఆ వివరాల్లోకెళితే… చాలా కాలం క్రితమే అక్కడికి వెళ్లి గ్రీన్ కార్డ్ హోల్డర్లుగా మారిన తెలుగు వాళ్లు సహా మిగిలిన వారందరిలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు ఆందోళన చెందని తెలుగు వారు ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదేమో. విద్యాభ్యాసం కోసం అక్కడికి వెళ్లిన మన విద్యార్థులు ఎంత త్వరగా వీలయితే… అంత త్వరగా కోర్సులను పూర్తి చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ఎందుకంటే… రేపటి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. విద్యాభ్యాసం ముగించుకుని అక్కడే ఉద్యోగం వెతుక్కుందామని నిన్నటి దాకా భావించిన వారు తమ అభిప్రాయాలను మార్చుకున్నట్లు సమాచారం. ఇక విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న వారు… ప్రస్తుతం అటు ముందుకెళ్లలేక ఇటు వెనక్కు రాలేక నానా అవస్థలు పడుతున్నట్లు సమాచారం. వీరిలో గ్రీన్ కార్డు రాని వారి సంఖ్యే ఎక్కువ.

అంతేకాకుండా గ్రీన్ కార్డు పొందడానికి అర్హత సాధించి ప్రస్తుతం అలాంటి దరఖాస్తులు పరిశీలనలో ఉన్న వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. గ్రీన్ కార్డు దరఖాస్తుల పరిశీలన సందర్భంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులు ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదు. అమెరికాలోని వారుంటున్న రాష్ట్రాన్ని వదిలి ఇంకో రాష్ట్రానికి కూడా వెళ్లడానికి కుదరదు. అలా వెళితే.. వారి దరఖాస్తులపై నెగెటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంది. దీంతో వారంతా బిక్కుబిక్కుమంటూ ఉన్నచోటే కాలం వెళ్లదీస్తున్నారు.

ఇక గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఆందోళనకు గురి కాకుండా ఉండలేకపోతున్నారు. నిన్నటిదాకా తమతో కలిసి మెలసి ఉన్న అమెరికన్లు… ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా రూటు మార్చేశారట. విదేశీయుల పట్ల వారు వివక్షాపూరిత వైఖరి ప్రదర్శించడం మొదలెట్టారట. దీంతో అప్పటిదాకా తమ హోదాకు తగ్గ గౌరవం దక్కించుకున్న విదేశీయులు… ట్రంప్ నిర్ణయం పుణ్యమా అని పనిచేస్తున్న ఆఫీసుల్లోనే తీవ్ర వివక్షకు గురి అవుతున్నారట. వీసా బిల్లు చట్టంగా మారకముందే పరిస్థితి ఇలా ఉంటే… అది కాస్తా చట్టంగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఏమి చేయాలో కూడా పాలుపోని స్థితిలో గ్రీన్ కార్డు హోల్డర్లు కొట్టుమిట్టాడుతున్నారు.

ఇదిలా ఉంటే… అమెరికాలో విద్యాభ్యసం పూర్తి చేసి ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరి పెళ్లిళ్లు ఖరారైన వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిందట. ట్రంప్ బిల్లు కారణంగా అబ్బాయిలు చేస్తున్న ఉద్యోగులు ఉంటాయో ఊడతాయో తెలియని నేపథ్యంలో వారికి తమ అమ్మాయిలనిచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించుకున్న తల్లిదండ్రులు ఉన్నపళంగా సదరు పెళ్లిళ్లను రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. ఈ వేసవిలో పీటలెక్కనున్న చాలా పెళ్లిళ్లు రద్దయ్యే ప్రమాదం లేకపోలేదు. ఏతావతా చెప్పొచ్చేదేమంటే… ట్రంప్ సింగిల్ నిర్ణయంతో అమెరికాలో ఉన్న మనోళ్లతో పాటు ఇతర దేశాల వారిని తీవ్ర అయోమయంలో పడేశారని చెప్పక తప్పదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *