నేడే మహా బతుకమ్మ

పూల పండుగకు సర్వం సిద్ధమైనది. హైదరాబాద్ ఎల్బీస్టేడీయంలో మంగళవారంనాడు మహా బతుకమ్మ కొలువుతీరనున్నది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మహాఉత్సవం మొదలవుతుంది. దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహాబతుకమ్మ ఉత్సవంలో 429 మండలాలకు చెందిన మూడువేలమంది మహిళలు పాల్గొంటున్నారు. వీరి కోసం సెర్ప్‌శాఖ ప్రతి మండలం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నది. వీరి ప్రయాణ ఖర్చుల కోసం ఒక్కొక్క జిల్లాకు మూడులక్షల రూపాయల చొప్పున కేటాయించారు. వీరికి భోజనం, మంచినీళ్లతో పాటు మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటుచేస్తున్నారు. ఈ నెల 28న నిర్వహించే సద్దుల బతుకమ్మకు కూడా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మహాబతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఉత్సవాల నిర్వహణలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. మహాబతుకమ్మ ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో పర్యాటకశాఖ ఎండీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ సహా, వివిధశాఖల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులంతా కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. మహాబతుకమ్మ తయారీ, గ్రౌండ్‌లో పూలు సమకూర్చటం, అలంకరణ, వీఐపీ సీటింగ్ తదితర ఏర్పాట్లు చూసే బాధ్యతను స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు అప్పగించారు. శానిటేషన్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయ్‌లెట్ల ఏర్పాట్ల పనులను జీహెచ్‌ఎంసీకు, మెడికల్‌కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేసే బాధ్యతను వైద్య ఆరోగ్యశాఖకు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ బాధ్యతను జలమండలికు అప్పగించారు.

ఎల్బీస్టేడియంలో జరుగుతున్న మహాబతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు కెవీ రమణాచారి, పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ, బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు 5 లక్షల రూపాయలు, ప్రయాణఖర్చుల కోసం మూడులక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క జిల్లాకు మొత్తం ఎనిమిదిలక్షల రూపాయలు కేటాయించి, బడ్జెట్ విడుదల చేసినట్టు చెప్పారు. ఈ నెల 28న నిర్వహించే సద్దుల బతుకమ్మలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు ఐదువేల మంది మహిళలు పాల్గొంటారని తెలిపారు. సద్దుల బతుకమ్మ ఆట పాట అనంతరం ఊరేగింపుగా బయలుదేరి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేయటానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వివరించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ పూలతో ఆడుకునే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలను ఏకం చేస్తుందన్నారు. బతుకమ్మను పూజిస్తే ఆదిశక్తిని పూజించినట్టేనని చెప్పారు. పర్యాటకశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం మాట్లాడుతూ, మహాబతుకమ్మ ఉత్సవంలో 3,000 మంది మహిళలు తంగేడుపువ్వు రూపంలో దర్శనమీయనున్నట్టు తెలిపారు. వీరంతా పసుపుపచ్చ చీరెలు ధరిస్తారని పర్యాటకశాఖ ఎండీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ తెలిపారు. ఎల్బీస్టేడియంలో ప్రభుత్వం మంగళవారం నిర్వహించే మహాబతుకమ్మను విజయవంతం చేసేందుకు జాగృతి మహిళా కార్యకర్తలు భారీగా తరలిరావాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడె రాజీవ్‌సాగర్ మరో ప్రకటనలో పిలుపునిచ్చారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *