మోదీకి నేను గొప్ప అభిమానినని: ట్రంప్

భారతదేశంలోని విదేశాంగ విధాన రూపకర్తలే కాదు, అమెరికాలోని భారతీయులు, ముఖ్యంగా పాలక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనుకూలవాదులు సైతం డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం భారత్‌కు ఇబ్బడిముబ్బడిగా లాభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ట్రంప్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి భారత్, అమెరికాల మధ్యే కాక, వ్యక్తిగత స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్‌ల మధ్య కూడా సంబంధాలు మరింత సన్నిహితమవుతాయని వారు భావిస్తున్నారు. ట్రంప్‌ విజయం ఉగ్రవాదం మీద సరికొత్త దాడికి, పాకిస్థానను ఒంటరిని చేయడానికి ఉపకరిస్తుందని వారు చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌ భారతదేశ ఆర్థికవ్యవస్థ గురించి, నరేంద్ర మోదీ నాయకత్వం గురించి సానుకూలంగా మాట్లాడారనే విషయం పరిగణనలోకి తీసుకోవాలని వారు గుర్తు చేస్తున్నారు.

ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించారనే ప్రకటన వెలువడగానే మొదటగా ఆయనను అభినందించిన వ్యక్తి మోదీయే. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉందని, దీని కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నామని ట్రంప్‌తో మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా అమెరికాలోని భారతీయ సంతతివారితో ముఖ్యంగా హిందూ వర్గాలతో ట్రంప్‌ కలిసిపోయి అనేక విధాలుగా ప్రశంసించారు. ట్రంప్‌ విజయం సాధించి, అధికారం చేపడితే, ఆయన అనుసరించబోయే విధానాల పట్ల భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అక్కడి భారతీయులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన వాటిని తేలికగా తీసిపారేశారు.

నిజానికి విదేశాంగ శాఖాధికారులే కాకుండా, భారతీయ పారిశ్రామికవేత్తలు పలువురు ట్రంప్‌ విధానాలపై అనేక రకాలుగా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులు, ఔట్‌సోర్సింగ్‌, వలసలు వంటివి ఈ విధానాల్లో ముఖ్యమైనవి. ప్రచార సమయంలో ట్రంప్‌ అమెరికా, మరో 11 దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై సందేహాలు వ్యక్తం చేశారు. అందులో భారత కూడా ఉంది. ట్రంప్‌ హెచ1బి వీసా వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తారని, దానివల్ల అమెరికా సంస్థలు భారత నుంచి ఐటీ నిపుణులను ఔట్‌సోర్సింగ్‌ చేయడం కష్టతరమవుతుందని రకరకాల భయాలు వెల్లడవుతున్నాయి. అంతేకాదు, గ్రీన కార్డులను స్తంభింపజేస్తారని కూడా భయాలు వ్యక్తమయ్యేసరికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, హెచసీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా వంటి దిగ్గజ సంస్థల షేర్లు పతనమయ్యాయి.

సానుకూల అంశాలు

అయితే, కొన్ని సానుకూల అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఔషధ సంస్థలు, స్థిరాస్తి రంగాల విషయంలో ఆయన వైఖరి సానుకూలంగానే కనిపిస్తోంది. ఔషధాల ఉత్పత్తిదారుల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తామని, ఔషధ సంస్థల భవితవ్యానికి ఎటువంటి ఢోకా ఉండదని ఆయన ప్రకటించడం భారతీయ కంపెనీలకు ఊరట కలిగించాయి. ఆయన ఔట్‌సోర్సింగ్‌ మీద కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఔట్‌సోర్సింగ్‌కు చరమగీతం పాడటం తథ్యమని ఆయన గట్టిగా చెప్పారు. భారతీయ కాల్‌ సెంటర్‌ ఉద్యోగుల పదజాలం మీదా, ఉచ్చారణ మీదా ఆయన జోకులు కూడా వేశారు. అయితే, ఇదంతా ఎన్నికల ప్రచారం వరకే పరిమితమని, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా కూడా వివిధ అంశాలపై ఇటువంటి ప్రతికూల వ్యాఖ్యానాలు చేశారనీ నిపుణులు వివరించారు. మోదీ-ఒబామాల మధ్య ఇటీవలి కాలంలో టెక్నాలజీపై జరిగిన ఒప్పందాలపై ట్రంప్‌ అనేక విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు భారతకు తీవ్ర ఆందోళన కలిగించాయి. ఏది ఏమైనా, ట్రంప్‌ విజయం భారతకు అనేక అవకాశాలు కల్పిస్తుందని, హిల్లరీ క్లింటన గెలిచి ఉంటే ఈ అవకాశాలకు ఆస్కారమే ఉండేది కాదని ప్రభుత్వ అధికారులు, బీజేపీలోని విదేశాంగ విధాన పరిశీలకులు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు.

హిల్లరీ గనుక గెలిచి ఉంటే, భారత్-పాకిస్థాన్ సంబంధాల విషయంలో అమెరికా వైఖరి ప్రతికూలంగా మారి ఉండేదని భారతీయ విదేశాంగ విధాన నిపుణులు భావిస్తున్నారు. పాలక బీజేపీకి చెందిన అమెరికా మద్దతుదార్లు (ప్రవాస భారతీయులు) ట్రంప్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అమెరికాలోని భారతీయుల్లో అధిక సంఖ్యాకులు మోదీ మద్దతుదార్లే. వారు ట్రంప్‌కు మద్దతునిస్తారా లేక హిల్లరీకి మద్దతునిస్తారా అని అటు రిపబ్లికన్లు, ఇటు డెమోక్రాట్లు ఒత్తిడి తెచ్చారు. ఈ మోదీ మద్దతుదార్లలో రిపబ్లికన్ పార్టీకి చెందినవారూ ఉన్నారు, డెమోక్రటిక్‌ పార్టీకి చెందినవారూ ఉన్నారు. అయితే మోదీని బట్టి ట్రంప్‌కో, హిల్లరీకో ఓటు వేయబోమని, స్థానిక సమస్యలను బట్టే ఓటేస్తామని ఈ మద్దతుదార్లు తెగేసి చెప్పడం ప్రారంభించారు.

కాగా, ఈ మద్దతుదార్లు సైతం ట్రంప్‌ విజయం భారతదేశానికి ఎటువంటి అవకాశాలు తీసుకొస్తుందోనని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ మద్దతుదార్లలో ట్రంప్‌కు బాగా సన్నిహితులైనవాళ్ళు కూడా ఉన్నారు. అమెరికాలో బాగా పట్టూ, పలుకుబడీ ఉన్న మేధావి వర్గ సంస్థ హెరిటేజ్‌ ఫౌండేషనలో సభ్యులుగా, సన్నిహితులుగా ఉన్న మోదీ మద్దతుదార్లు కూడా ఉన్నారు. వీళ్లు ట్రంప్‌ విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నారు. ఈ హెరిటేజ్‌ ఫౌండేషన ట్రంప్‌కు సలహాదారు. ట్రంప్‌కు ఎన్నికల ప్రచారంలో మద్దతు కూడా ఇచ్చింది. ఇంతకూ దక్షిణాసియా పట్ల ట్రంప్‌కు ఉన్న అభిప్రాయాలేవీ ఇంతవరకూ వెలుగు చూడలేదు. ఆయన ఒకే ఒకసారి భారత పర్యటనకు వచ్చారు. అప్పుడు కూడా ముంబైను మాత్రమే సందర్శించారు.

ఆయన ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ, మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత భారత ఓ ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ‘‘ప్రపంచంలో పాకిస్థాన్ అతి పెద్ద ప్రమాదకర దేశంగా అవతరించింది’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ను అదుపులో పెట్టడం భారత్‌కు మాత్రమే సాధ్యమని కూడా ఆయన అన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో అమెరికాకు ప్రధాన, కీలక శత్రువు చైనా అని ఆయన అభివర్ణించారు. ఇవన్నీ భారత్‌కు శుభ సూచకాలే! ట్రంప్‌ విజయం సాధించగానే భారతదేశం ఆయనను ప్రశంసలతో ముంచెత్తేదే. అయితే, అది ఆచి తూచి అడుగువేయడానికి కారణం ట్రంప్‌ విజయం విషయంలో అమెరికాలో అల్లర్లు చెలరేగుతుండడమే. ఈ అల్లర్లను బట్టి, నిరసనలను బట్టి చూస్తే ఆయన ఒకసారి పదవీ కాలం పూర్తి చేయడమే గగనంగా కనిపిస్తోంది.

అనుభవ రాహిత్యం

వ్యాపార, వాణిజ్యాల్లో తప్ప రాజకీయంగా, పాలనాపరంగా ఆయనకు ఏమాత్రం అనుభవం లేకపోవడం కూడా ఓ సమస్య కావచ్చని భారత భావిస్తోంది. పాకిస్థాన ప్రాయోజిత ఉగ్రవాదంతో సహా ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలన్నిటి పైనా పోరాటం సాగించే విషయంలో ట్రంప్‌ అభిప్రాయాలు, భారత అభిప్రాయాలు కలుస్తున్నాయి కానీ, మిగిలిన అంశాల విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉందని భారతీయ విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ప్రజలందరికీ తాను అధ్యక్షుడిననీ, అన్ని దేశాలకూ తాను మిత్రుడిననీ ఆయన రుజువు చేసుకునేంతవరకూ భారత జాగ్రత్తగానే మెల గాల్సి ఉంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలను, ప్రకటనలను ఆయన గెలిచిన తరువాత ఉపసంహరించుకుంటున్నారు. ముస్లింల వలసలను ఆపేస్తానని, అమెరికా, మెక్సికోల మధ్య గోడ నిర్మిస్తానని, నాటో మీద నిధులు ఖర్చు చేయడం ఆపేస్తానని ఆయన ఎన్నికల తరువాత చెప్పడం ప్రారంభించారు. ఇక, రిపబ్లికన్లు మొదటి నుంచీ భారతకు మద్దతునిస్తూనే ఉన్నారు. డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన విదేశాంగ మంత్రిగా ఉండగా, భారత్‌తో స్నేహంగానే ఉన్నప్పటికీ, చైనా, పాకిస్థాన్‌ల పట్ల మొదటి నుంచీ మొగ్గు చూపిస్తూనే ఉన్నారు. ఒబామా కూడా మొదట్లో భారత్‌తో స్నేహభావంతోనే వ్యవహరించారు. అయితే, 2010లో ఆయన భారత్ సందర్శనకు వచ్చినప్పుడు, అణు, యుద్ధ విమానాల ఒప్పందాల విషయంలో విఫలం కావడం పరిస్థితిలో మార్పు తెచ్చింది. భారత్‌తో అణు వ్యాపారం ప్రారంభించడానికి ఒబామా చేసిందేమీ లేదు. పైగా ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా మత సహనం మీద భారత్‌కు ఉపన్యాసాలు ఇవ్వడం కూడా మొదలు పెట్టారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, అణు సరఫరాదార్ల బృందంలో సభ్యత్వం కోసం భారత్ ఎంతగా ప్రయత్నాలు సాగించినా ఒబామా నుంచి లభించిన మద్దతు మాత్రం శుష్కప్రియాలే.

డొనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎలా స్పందిస్తారో చెప్పలేం గానీ, భారత్ సమస్యలు, తీవ్ర ఆందోళనల విషయంలో మాత్రం ఆయన భారత్ వెంటే ఉంటారనడంలో సందేహం లేదు. మోదీ అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడు ప్రసంగించినా ఉగ్రవాదం గురించి ప్రస్తావించకుండా ప్రసంగం ముగించరు. భారత్‌కు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న సమస్య అది. ట్రంప్‌ తప్పనిసరిగా ఆ సమస్య గురించి పట్టించుకోవడం జరుగుతుంది. ఈ సమస్య విషయంలో భారత్, అమెరికాల అభిప్రాయాలు ఒక్కటే! ట్రంప్‌ దాదాపు ఏడాది క్రితం నుంచీ పాకిస్థాన ప్రమాదకర దేశమని చెబుతూనే ఉన్నారు. పాకిస్థాన విషయంలో అటువంటి వైఖరిని తీసుకున్న అధ్యక్షుడు మరొకరు లేరు. ప్రధానంగా వాణిజ్యవేత్త అయిన ట్రంప్‌ భారత్‌లో అమెరికా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి అభ్యంతర పెట్టకపోవచ్చు. భారత ఆర్థికంగా, పారిశ్రామికంగా, రాజకీయంగా ముందుకు దూసుకుపోతోందని, దీని గురించి ఏ దేశమూ పట్టించుకోకపోవడమేమిటని ఆయన ఓ కార్యక్రమంలో ప్రశ్నించారు.

ఆయన మాటలు, చేతలను బట్టి అర్థమవుతున్నదేమిటంటే, ఆయన భారత్ పట్ల మొగ్గు చూపే అవకాశం ఉంది. చైనా కంటే భారత్‌కే ఎక్కువగా మార్కెట్‌ అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉంది. చైనా విషయంలో ఆయన సందిగ్ధంలో ఉన్నారు. వాణిజ్య సంబంధాల విషయంలో ఆయన తరచూ చైనాపై విమర్శలు గుప్పించడం గమనించాల్సిన విషయం. అమెరికా, చైనాల మధ్య ఏటా 42 వేల కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. మున్ముందు అంత వ్యాపారం జరిగే అవకాశం ఉండకపోవచ్చు. చైనా-భారత్ సంబంధాలపై కూడా ఆయన భారత్‌కు అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను భారత్‌కు, ముఖ్యంగా మోదీకి గొప్ప అభిమానినని ఆయన అనేక సందర్భాల్లో బయటపెట్టారు. ఇదే ధోరణి మున్ముందు కూడా కొనసాగవచ్చు.!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *