నిరూపిస్తే..సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న కేసీఆర్

అసలే కేసీఆర్. ఆపైన కోపం వస్తే ఎలా ఉంటుంది? మనుసులో దాచుకున్న బడబాగ్నిని ఒక్కసారిగా కక్కేస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో.. కేసీఆర్ కు కోపం వచ్చినప్పుడు ఆయన మాటలు చురకత్తుల్లా మారిపోతాయి. ప్రత్యర్థిని కోసేసినట్లుగా ఆయన మాటలు ఉంటాయి. గడిచిన మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విడతల వారీ విమర్శల్ని.. ఒక్క మీడియా సమావేశంలో హోల్ సేల్ గా కొట్టిపారేశారు. అంతేనా.. అమిత్ షాను తన మాటలతో బండకేసి బాదేసినంత పని చేశారు.

అమిత్ షా మాటలు కేసీఆర్ ను ఎంతగా ఇరిటేట్ చేశాయనటానికి నిదర్శనం.. తొలిసారి తన సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న సవాలు విసిరేంత. రాష్ట్రంలో తమను విమర్శించే సాహసం చేయలేని రీతిలో విపక్షాలు ఉన్నాయని ఫీలవుతున్న వేళ.. అమిత్ షా మాటలు తనను ఎంతగా హర్ట్ చేశాయన్న విషయాన్ని కేసీఆర్.. తన ప్రెస్ మీట్తో తేల్చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేసిన కేసీఆర్ ఏమన్నారంటే..

= తెలంగాణకు 20వేల కోట్ల రూపాయిల అదనపు నిధులు ప్రతి ఏటా ఇస్తున్నామని అమిత్ షా చెప్పారు. కనీసం రూ.200 కోట్లు అయినా ఇచ్చారేమో చూపించాలని సవాల్ చేస్తున్నా. ఒకవేళ నేను చెప్పిన దాని కంటే ఎక్కువ ఇచ్చినట్లు నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. 2016-17లో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50013 కోట్లు వెళితే.. కేంద్రం నుంచి అన్ని విధాలుగా తెలంగాణకు వచ్చింది కేవలం రూ.24561 కోట్లు మాత్రమే.
= నన్ను ఏమన్నా ఫర్లేదు. కానీ.. తెలంగాణ నుంచి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు. అమిత్ షా గతంలోనూ రాష్ట్రం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సర్లేనని ఊరుకున్నా. గతంలో వచ్చినప్పుడు రూ.90వేల కోట్లు ఇచ్చినట్లుగా చెప్పారు. ఆయన వెళ్లినతర్వాత స్థానికంగా ఉండే నేతలు అమిత్ షా చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అన్నారు. ఎందుకులే అని పట్టించుకోలేదు.

= ఈసారి ప్రత్యేకంగా మూడు రోజుల పర్యటన పెట్టుకొని మరీ ప్రభుత్వం మీద వరుసపెట్టి దాడి చేస్తున్నారు. దేశంలోని నాలుగైదు సంపన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పుడు రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతోంది. నన్ను చాలా దేశాల రాయబారులు పొగిడారు. ప్రధాని సహా అనేక మంది కేంద్రమంత్రులు పొగిడారు. కేంద్రమంత్రి ఉమాభారతి అయితే తెలంగాణ మోడల్ ను కాపీ కొట్టమని 28 రాష్ట్రాలకు చెప్పారు. ఇంతమంది ప్రశంసిస్తుంటే అమిత్ షా మాత్రం అద్భుతమైన అబద్ధాలు చెప్పారు.

= ప్రపంచం ముందు నిలిచి గెలిచే రీతిలో కడుపు.. నోరు కట్టుకొని అవినీతిరహితంగా పని చేస్తున్నాం. కేసీఆర్ గా నన్ను వ్యక్తిగతంగా విమర్శస్తే ఏమీ మాట్లాడను. కానీ.. తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం ప్రాణం పోయినా రాజీ పడేది లేదు.

= ఇలాంటి అసత్యాలు వేరే వారు చేస్తే లైట్ తీసుకునే వాడిని. కానీ.. అమిత్ షా దేశాన్ని పాలించే పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఇప్పుడు నేను మౌనంగా ఉంటే అంగీకరించినట్లు అవుతుంది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. అప్పుడప్పుడు నాక్కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాననిపిస్తుంది. వాళ్లపార్టీని విస్తరించుకోవటానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎన్నికల్లో ఏ ఎల్లయ్యనో.. పుల్లయ్యతోనో పోటీ చేసి గెలవాల్సిందే తప్పించి ఏకగ్రీవంగా ఎవరూ ఎన్నిక కాదు. అమిత్ షా లాంటి స్థాయి ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పకూడదు.

= దేశాన్ని సాకే రాష్ట్రాలు ఐదారే ఉన్నాయి. మిగిలినవన్నీ లోటు రాష్ట్రాలే.  దేశాన్ని పెంచిపోషించేవి గుజరాత్.. మహారాష్ట్ర.. తెలంగాణ .. తమిళనాడు.. ఢిల్లీ.. కర్ణాటక లాంటివి ఉన్నాయి. వాటిల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. దేశానికి తెలంగాణ ఇచ్చే డబ్బు ఎంతో అమిత్ షా తెలుసుకోవాలి. కేంద్రానికి రూ.50013 కోట్లు ఇస్తే.. కేంద్రం నుంచి వచ్చిన అన్ని రకాల నిధులు కలిపితే వచ్చింది రూ.24561 కోట్లు మాత్రమే. విభజన చట్టంలో వెటర్నరీ వర్సిటీ లాంటివి ఇవ్వాలని ఉంది. గిరిజన వర్సిటీ ఇంతవరకూ రాలేదు. ఆయనేమో ఇచ్చేశామని చెబుతున్నారు. మూడు వర్సిటీలకు రూ.40800 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. అసలు అన్ని నిధులు అవసరమవుతాయా?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *