మరో పదేండ్లూ కేసీఆరే సీఎం : మంత్రి కేటీఆర్

రాష్ర్టానికి మరో పదేండ్లు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే ముఖ్యమంత్రిగా ఉంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు. మూడేండ్ల టీఆర్‌ఎస్ పాలనను రాష్ర్టానికి స్వర్ణయుగంగా ఆయన అభివర్ణించారు. జగిత్యాలలోని మినీ స్టేడియంలో జరిగిన జనహిత ప్రగతిసభలో మంత్రి కేటీఆర్ సుమారు 40 నిమిషాలపాటు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జైత్రయాత్ర జగిత్యాల నుంచే ఆరంభం అవుతుందని కేటీఆర్ గుర్తుచేశారు. అంతకు ముందు ఆయన కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రంలో పాగావేసేందుకే ముందస్తు ఎన్నికలకు బీజేపీ ఆలోచన చేస్తున్నదని ఈ సందర్భంగా అన్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. భారీగా ప్రజలు హాజరైన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను ఉప్పు పాతరేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు.

తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడాన్ని ఎద్దేవా చేసిన మంత్రి.. కాంగ్రెస్ వాళ్లు రాజకీయ నిరుద్యోగులుగా మారితే వారికి భృతి ఇచ్చి అదుకుంటామని చురకలు అంటించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే.. గత 58 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను, టీడీపీని కడిగి పారేశారు. మధ్యమధ్యలో పిట్టకథలు చెప్తూ అల రించారు. జగిత్యాల జనహిత ప్రగతిసభకు నిజా మాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించగా.. మంత్రి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి 2006లో ఎన్నికల బరిలోకి దిగితే.. కేసీఆర్‌ను ఓడించి, తెలంగాణవాదంలేకుండా చేయాలని నాటి సీఎం కుట్ర చేశారని, ఆ సమయంలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు అంతా నిరాకరిస్తే.. నిస్సిగ్గుగా జీవన్‌రెడ్డి బరిలో నిలిచారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే జీవన్‌రెడ్డి సమైక్య రాష్ట్రంలో పోషించిన పాత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. తెలంగాణ అకాంక్ష బలంగా ఉన్నదని గుర్తించి, 2004 ఎన్నికల్లో ఒంటరి పోరు ద్వారా గెలువలేమని సోనియాగాంధీ నుంచి జీవన్‌రెడ్డి వరకు అంతా గులాబీ కండువా కప్పుకొని గెలిచిన మాట వాస్తవం కాదా? తెలంగాణ ఇస్తామన్న మాటను యూపీఏ నిలబెట్టుకోకపోతే.. ఆనాడు కేంద్రమంత్రి పదవిని కాలి చెప్పులా తృణప్రాయంగా వదలిపెట్టి ప్రత్యేక తెలంగాణ కోసం 2006లో కేసీఆర్ ఎన్నికల బరిలో దిగినమాట వాస్తవం కాదా? కేసీఆర్‌ను ఓడించి తెలంగాణ నినాదం లేకుండా చేయాలని నాటి సీఎం వైఎస్ కుట్రలు పన్ని, కేసీఆర్‌పై పోటీచేసే అభ్యర్థుల కోసం వెతికితే మా తెలంగాణ అకాంక్షకోసం పోరాటం చేస్తున్న కేసీఆర్‌పై పోటీచేయం అంటూ అందరూ తిరస్కరిస్తే.. నిస్సిగ్గుగా బరిలో నిలిచింది జీవన్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌పై ఎలాగూ తాను గెలువలేనని, ఆయనను ఓడించడం ఎవరితరం కాదని, కానీ, తాను ఓడిపోతే మంత్రి పదవి ఇవ్వాలంటూ బేరమాడిన చరిత్ర జీవన్‌రెడ్డిదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పొరపాటున అనాడు జీవన్‌రెడ్డి గెలిచినా.. కేసీఆర్ ఓడినా ఈనాడు తెలంగాణ వచ్చి ఉండేదా? అని ప్రశ్నించారు. 2004 ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకొని తెలంగాణ అశీర్వాదంతో గెలిచిన జీవన్‌రెడ్డి.. అంధ్రానాయకుల తొత్తుగా మారారని ఆరోపించారు. చైతన్యవంతమైన జగిత్యాలకు ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండటం సరైందేనా? అలోచించాలన్నారు. తెలంగాణ బీడు భూములను మాగాణి భూములుగా మార్చాలన్న లక్ష్యంతో కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయబద్ధంగా రావాల్సిన 1200 టీఎంసీలను మళ్లించేందుకు అనేక ప్రాజెక్టులకు కేసీఆర్ రూపకల్పన చేస్తే, చనిపోయిన వాళ్ల పేరుతో కేసులు వేయించి, వాటిని అడ్డుకోవడానికి చూస్తున్నది ఎవరో గుర్తించాలన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా జీవన్‌రెడ్డి ఒప్పుకున్నారని చెప్పారు. అనాడు వైఎస్‌తో కలిసి ఉద్యమానికి ద్రోహంచేసే ప్రయత్నం జీవన్‌రెడ్డి చేయగా.. జగిత్యాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎల్ రమణ ఇంకా చంద్రబాబు వెంట తిరుగుతున్నారని, చింత చచ్చినా పులుపు చావనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అధికారంలోకి వస్తే నిరుద్యోగభృతి ఇస్తామంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడాన్ని కేటీఆర్ ఎద్దేవాచేశారు. భవిష్యత్తులో దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పారు. ఆ తరుణంలో రాజకీయ నిరుద్యోగులుగా మారే కాంగ్రెస్ నాయకులకు తాము నిరుద్యోగ భృతి ఇస్తామని చురకలు వేశారు. 70 ఏండ్ల దరిద్రాన్ని, బాధలను మిగిల్చిన కాంగ్రెస్‌ను ఉప్పుపాతర వేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై కాంగ్రెస్ నేతలు అవినీతి ఆరోపణలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. అసలు అవినీతి, దోపిడీ ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *