ముంబై-కోల్‌కతా అమీతుమీ.. ఫైనల్‌కు వచ్చేదెవరు

ప్లే ఆఫ్‌ దశ తుది అంకానికి చేరుకుంది..! తొలి క్వాలిఫయర్‌తోనే పుణె దర్జాగా ఫైనల్‌కు దూసుకెళ్లగా.. డిఫెండింగ్‌ చాంప్‌ సన్‌రైజర్స్‌ ఎలిమినేట్‌ అయింది..! ఇప్పుడు హైదరాబాద్‌లో తమతో అంతిమ సమరం చేసే ప్రత్యర్థి కోసం పుణె ఎదురుచూస్తోంది..! మరి, ఆ జట్టుతో టైటిల్‌ ఫైట్‌ చేసేది ఎవరు..! మూడోసారి ట్రోఫీని ముద్దాడలనుకుంటున్న ముంబై, కోల్‌కతాల్లో ముందుకెళ్లేదెవరు..! ఫైనల్‌ కాని ఫైనల్లో నెగ్గేదెవరో తేలేది నేడే..!
 బెంగళూరు:సిసలైన సవాల్‌కు మాజీ చాంపియన్లు సిద్ధమయ్యాయి. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్ లో ముంబై, కోల్‌కతా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నెగ్గిన జట్టు ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరిగే అంతిమ సంగ్రామంలో పుణెను ఢీకొంటుంది. ఓడిన జట్టుకు ఇంటిదారే. దాంతో, చావోరేవో పోరులో ఎలాగైనా గెలిచి టైటిల్‌ ఫైట్‌కు వెళ్లాలని ఇరు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. ఇదే వేదికపై గత మ్యాచలో హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతా ఆత్మవిశ్వాసంలో ఉండగా.. తొలి క్వాలిఫయర్‌లో పుణె చేతిలో చిత్తయిన ముంబై కాస్త డీలా పడింది.
అయితే.. చరిత్ర మాత్రం ఇండియన్స్ వైపే. లీగ్‌ దశలో రెండు మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌లో కోల్‌కతాతో ఆడిన 20 మ్యాచ్‌ల్లో 15 విజయాలతో ముంబైకి ఘనమైన రికార్డు ఉంది. దాంతో, నైట్‌రైడర్స్‌పై తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని రోహిత్ సేన కోరుకుంటోంది.
ఈ సారి ఆ రికార్డును బద్దలుకొట్టి ప్రతీకారం తీర్చుకోవాలని గంభీర్‌సేన భావిస్తోంది. అయితే, గత వారం రోజులుగా బెంగళూరులో తిష్ట వేసిన వరుణుడు ఇరు జట్లనూ ఆందోళనకు గురి చేస్తున్నాడు. వర్షం కారణంగా ఎలిమినేటర్‌కు మూడు గంటలకు పైగా అంతరాయం కలిగింది. శుక్రవారం కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. దాంతో రెండు జట్లూ వరుణుడిపై ఓ కన్నేసి తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
 బ్యాట్స్‌మెన్ ఏం చేస్తారో…
పరాజయంతో పదో సీజన్‌ను ఆరంభించిన ముంబై జట్టు.. కోల్‌కతాపైనే బోణీ కొట్టింది. ఆ ఉత్సాహంతో తమ తొలి 11 మ్యాచల్లో తొమ్మిదింట్లో నెగ్గిందా జట్టు. కానీ, చివరి దశలో రోహిత్ సేన డీలా పడింది. ఆఖరి నాలుగు మ్యాచ్ ల్లో మూడింట్లో ఓడింది. క్వాలిఫయర్‌-1లో చివరి రెండు ఓవర్లలో పుణెకు 41 పరుగులు సమర్పించుకోవడం జట్టును దెబ్బకొట్టింది. కెప్టెన రోహిత, రాయుడు, పొలార్డ్‌.. పుణె అనామక స్పిన్నర్‌ సుందర్‌ ముందు తలొంచారు. చిన్నస్వామి స్లో పిచ్ పై కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్‌ను చూశాక.. ముంబై బ్యాటింగ్‌ విభాగం క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉంది. ఇక క్వాలిఫయర్‌1లో చివరి రెండు ఓవర్లు మినహాయిస్తే ముంబై బౌలింగ్‌ బాగుంది.
ఈ మ్యాచ్ కూ చిన్నస్వామి పిచలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. బుధవారం కోల్‌కతా స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్‌ చేయగా.. పేసర్లు కట్టర్లు, క్రాస్‌-సీమ్‌ డెలివరీలతో సనరైజర్స్‌ బ్యాట్స్‌మెనకు చుక్కలు చూపించారు. అందువల్ల మిడిల్‌ ఓవర్లలో తమ జట్టులో అత్యధికంగా ఏడు వికెట్లు పడగొట్టిన హర్భజన కీలకం కానున్నాడు. కర్ణ్‌ శర్మ, క్రునాల్‌ ఇద్దరూ రైట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్ ను ఇబ్బంది పెట్టగలరు. పేసర్లు మలింగ, బుమ్రా మెరుగ్గా రాణిస్తున్నా.. పుణెపై మెక్లెన్‌గన్ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఏదేమైనా.. భీకర ఫామ్‌లో ఉన్న కోల్‌కతా కెప్టెన్ గంభీర్‌ను, ప్రమాదకర ఓపెనర్లు క్రిస్‌ లిన్, సునీల్‌ నరైన్ ను ఎంత త్వరగా పెవిలియన్ చేరిస్తే ముంబైకి అంత మంచిది.
ప్రతీకారం తీర్చుకునేనా..
ముంబై మాదిరిగా కోల్‌కతా ఆరంభంలో మెరిసి తర్వాత తడబడింది. లీగ్‌ సగం దశ వరకూ అగ్రస్థానం కోసం పోటీ పడ్డ గంభీర్‌సేన ప్లే ఆఫ్‌ చేరేందుకు ఆఖరి మ్యాచ్ వరకూ వేచి చూడాల్సి వచ్చింది. అయినా.. ఎలిమినేటర్‌లో బౌలర్ల కృషి, వరుణుడి అండతో గట్టెక్కింది. వాస్తవానికి బౌలింగ్‌లో నిలకడ లేని గంభీర్‌సేన హైదరాబాద్‌పై అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. ఉమేష్‌, కల్టర్‌నైల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌తో పాటు స్పిన్నర్లు నరైన్, చావ్లా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ముంబైపైనా ఇలాంటి ప్రదర్శనే చేస్తే కోల్‌కతాకు తిరుగుండకపోవచ్చు.
అయితే, ఆ జట్టు బ్యాటింగ్‌లో లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్‌లో కోల్‌కతా ఇబ్బంది పడుతోంది. ఎలిమినేటర్‌లో ఆరు ఓవర్ల షూటౌట్‌లో తొలి రెండు ఓవర్లలోనే నైట్‌ రైడర్స్‌ మూడు వికెట్లు కోల్పోయింది. దీన్ని సన్ రైజర్స్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. గాయపడ్డ మనీష్‌ పాండే ఈ మ్యాచ్ కూ అనుమానమే. అందువల్ల.. కెప్టెన్ గంభీర్‌పైనే భారం వేయకుండా మిగతా బ్యాట్స్‌మెన్ బాధ్యతలు తీసుకోవాలి. క్రిస్‌ లిన్, సునీల్‌ నరైన్ నుంచి జట్టు శుభారంభం కోరుకుంటోంది.
 ఊతప్ప, యూసుఫ్‌ స్థాయికి తగ్గట్టు ఆడితే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పవు. స్లో వికెట్‌ దృష్ట్యా ఈ సీజన్ లో తమ సక్సె్‌సఫుల్‌ స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌ను కేకేఆర్‌ తిరిగి జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది. అప్పుడు.. ఇషాంక్‌ జగ్గీ, సూర్యకుమార్‌లో ఒకరు తప్పుకోవాల్సిందే. కెప్టెన్ గంభీర్‌.. మిస్టరీ స్పిన్నర్‌ నరైన్ తో బౌలింగ్‌ ఆరంభించే ఆలోచన చేయొచ్చు. ముంబైతో చివరి మ్యాచ్ లో తన విండీస్‌ సహచరుడైన లెండిల్‌ సిమన్స్ ను నరైన్ అవుట్‌ చేశాడు. ఏదేమైనా.. కోల్‌కతా మరోసారి సమష్టి ప్రదర్శన చేస్తేనే ముంబైపై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్‌కు చేరుకోగలదు.
జట్లు (అంచనా)
ముంబై: పార్థివ్‌ పటేల్‌ (వికెట్‌ కీపర్‌), సిమన్స, రోహిత్ (కెప్టెన్), రాయుడు, పొలార్డ్‌, క్రునాల్‌, హార్దిక్‌, హర్భజన్, మెక్లెన్ గన్, మలింగ, బుమ్రా.
కోల్‌కతా: నరైన్, క్రిస్‌ లిన్, గంభీర్‌ (కెప్టెన్), ఊతప్ప, యూసుఫ్‌, సూర్యకుమార్‌, ఇషాంక్‌/కుల్దీప్‌, పియూష్‌ చావ్లా, కల్టర్‌నైల్‌, ఉమేష్‌, ట్రెంట్‌ బౌల్ట్‌.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *