దొంగలని పట్టించిన మహిళా హోంగార్డు

హైదరాబాద్: నగరంలోని జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఓ మహిళా హోంగార్డు అప్రమత్తత అంతర్ రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు సభ్యుల ఆటకట్టించేలా చేసింది. ఆర్టీసీ హోంగార్డుగా పనిచేస్తున్న ప్రసన్న రెండు రోజుల క్రితం జేబీఎస్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు దొంగల నుంచి 58తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ముఠాపై ఇప్పటికే నగరంలో 9 కేసులతోపాటు మూడు రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు సంబంధించిన కేసులున్నాయి. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లను వీరు టార్గెట్ చేస్తూ, ప్రయాణికుల్లా నటిస్తూనే తోటి ప్రయాణికుల బ్యాగ్‌లోని ఆభరణాలు కాజేయడం, వాటిని చాకచక్యంగా తమవారితోనే అక్కడ్నుంచి దాటేస్తారు. గురువారం నార్త్ జోన్ డిసిపి ప్రకాశ్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహంకాళి ఏసీపీ తిరుపతి, ఇన్‌స్పెక్టర్లు ఉమామహేశ్వరరావు, బి.నరహరిలతో కలిసి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. హర్యానాలోని జింద్‌ సమీపంలోని ఆష్రఫ్‌గఢ్‌కు చెందిన పూల్‌సింగ్‌(55), రఘుబీర్‌(25), సురేందర్‌సింగ్‌, రామీర్‌విడ్లు, భజరంగ్‌, కులదీప్‌ అలియాస్‌ వినోద్‌, రాంఫల్‌ బిడ్డులు ముఠాగా ఏర్పడి నెలలో ఒకసారి హైదరాబాద్‌ వచ్చేవారు. ప్రయాణికుల మాదిరి ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ఎక్కి నగలను అపహరిస్తున్నారు. జనవరి 15న గోదావరిఖని, జవహర్‌నగర్‌కు చెందిన దేవా రాణి తన పిల్లలతో కలిసి సామగ్రితో జూబ్లీ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా ప్రయాణికుల వలే సాయంపడతామని నమ్మబలికి సంచిలోని ఏడున్నర తులాల బంగారు నగలు అపహరించి దిగి వెళ్లిపోయారు. ఆమె మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల రికార్డుల ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కాగా, ఈ దొంగల ముఠాలోని పూల్ సింగ్, సురేందర్ సింగ్ రెండ్రోజుల క్రితం జేబీఎస్ కు వచ్చారు. ఇద్దరూ రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో ఆర్టీసీ హోంగార్డు ప్రసన్న అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులకు పట్టించింది. కాగా, గతంలో జేబీఎస్‌లో జరిగిన చోరీని తామే చేశామని ఈ ఇద్దరు అంగీకరించారు. గోపాలపురం, మార్కెట్‌, మారేడుపల్లి ఠాణాల పరిధుల్లో అపహరించిన 58 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. ప్రయాణికులు ఇలాంటి దొంగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డిసిపి సూచించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *