రివ్యూ:కోకోకోకిల

కథ 

కోకిల(నయనతార)ది ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. స్పాలో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. ఓసారి అనారోగ్యం పాలైన అమ్మ(శరణ్య)ను ఆసుపత్రికి తీసుకెళ్తే లంగ్ క్యాన్సర్ అని తేలుతుంది. చికిత్స కోసం 12 లక్షలు అవసరమవుతాయి. దీని కోసం కొకైన్ ప్యాకెట్లు సప్లై చేసే ఏజెంట్ గా మారుతుంది కోకిల. కానీ అనుకోని సంఘటనల వల్ల తన యజమాని మంచాన పడడానికి కారణం అవుతుంది. దీంతో ముంబైలో ఉండే అసలు డాన్ భాయ్(హరీష్ పేరడీ) కోకిలకు వంద కిలోల కొకైన్ ను చెప్పిన చోట చేరవేస్తే వదిలేస్తానని చెబుతాడు. ఇక అక్కడి నుంచి పిల్లి ఎలుకా చెలగాటం మొదలవుతుంది. అనూహ్యంగా కోకిలను విపరీతంగా ప్రేమించే ఆ ఇంటి ఎదురుగా ఉండే కిరాణా షాప్ ఓనర్ శేఖర్(యోగిబాబు)కుడా ఇందులో ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఈ చక్రవ్యూహంలో నుంచి కోకిలతో పాటు ఆమె తల్లి, చెల్లి, నాన్న ఎలా బయటపడ్డారు అనేదే కోకోకోకిలా అసలు కథ

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా మొత్తం నయనతార మరియు ఆమె ఆర్థిక సంక్షోభం చుట్టూ తిరుగుతుంది. కాగా నయనతార తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. తన అభినయంతో అందంతో చిత్రంలోనే హైలెట్ గా నిలుస్తూ ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసింది.

హీరోల్లా ఫైట్స్ చేయకపోయినప్పటికీ కేవలం తన అమాయకత్వంతోనే విలన్ల అంతు చూసే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే తన తల్లిని తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆమె పడే బాధ, ఇబ్బందులు సినిమాకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తోంది.

మొదటి సగభాగంలో సినిమా సెటప్ అంతా వాస్తవికానికి దగ్గరగా సాగుతూ.. మాదకద్రవ్యాల వ్యాపారం కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపించారు. యోగి బాబు మొట్టాయ్ రాజేంద్రన్, శరణ్య మంచి పాత్రలు పోషించారు. మెయిన్ గా యోగి బాబు తన కామెడీ టైమింగ్ తో బాగానే నవ్వించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో కొన్ని దృశ్యాలని అనవసరంగా సాగాతీశారనిపిస్తోంది. రెగ్యూలర్ సాగే కథనం, సినిమాలోని ఉత్సుకతకు అడ్డుపడుతుంది. హీరోయిన్ తన కుటుంబం తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకోవలసి వచ్చే సీరియస్ సన్నివేశంలో దర్శకుడు అనవసరమైన కామెడీ ట్రాక్ ని చొప్పించి.. కథలోనో సీరియస్ నెస్ ని డైవర్ట్ చేశాడు. పైగా కథలో నమ్మశక్యం కాని ట్విస్ట్ లు ఉండటం కూడా అంతగా రుచించదు.

క్లైమాక్స్ సీక్వెన్స్ లోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా చాలా సాధారణమైనవిగా అనిపిస్తాయి. పైగా ఫస్టాఫ్‌లో అక్కడక్కడ బాగా సాగినట్లుండే సీన్లు ప్రేక్షకుల సహననానికి పరీక్ష పెట్టినట్లు ఉంటుంది.

ఇక సినిమా సాగే తీరు, సినిమాలోని సంఘటనలు నటించిన నటీనటులు ఇలా ప్రతి అంశంలో తమిళ్ నేటివిటీ కనిపిస్తుంది. మరీ ఎక్కువుగా తమిళ వాసనలు వస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తమిళ్ సినిమా చూస్తున్న ఫీలింగే వస్తోంది.

నటీనటులు 

భారం మొత్తం సోలోగా నయనతారనే మోసింది. నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసింది కూడా. అమాయకత్వం ప్రదర్శిస్తూనే తన అవసరం తీరడం కోసం అవతలి వాళ్ళను చంపించేందుకు సైతం వెనుకాడని జిత్తులమారి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. తను కాకుండా ఇది ఎవరు చేసినా వారం ఆడటం కూడా గొప్పే. కోకోకోకిలా చూడడానికి వంద కారణాలు చెప్పమంటే అందుకు తొంభై నయన్ పేరే చెప్పాలి. అందంతో పాటు రెగ్యులర్ గా చేసే పాత్రలకు భిన్నంగా ఇలాంటివి ఎంచుకోవడం తన టేస్ట్ ని చెప్పకనే చెబుతుంది. డెన్ లో ఒకడిని చంపించే సీన్ లో పీక్స్ లో కనపడుతుంది నయన్. ఇక మిగిలిన వాళ్ళందరూ సమాన ప్రాధాన్యత దక్కించుకున్నారు.

శరణ్య రెగ్యులర్ గానే  అనిపించినా పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించారు. కోకిల నాన్నగా ఆరెస్ శివాజీ, గుడుంబా కొనేవాడిగా గుండు రాజేంద్రన్ అతికినట్టు సరిపోయారు. ఇన్స్ పెక్టర్ గా శరవణన్ కొత్త మొహమే అయినప్పటికీ బాగానే కనెక్ట్ అవుతాడు. మొదట్లో ఇచ్చిన బిల్డప్ యోగిబాబుకి తరువాత లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. నయన్ చెల్లిని ప్రేమించే పాత్ర వేసిన అన్బు దాసన్ అవసరానికి మించి ఓవరాక్షన్ చేయడం చికాకు పుట్టిస్తుంది. డాన్లుగా నటించిన హరీష్, చార్లెస్, కుంజు అందరు వాటికి తగ్గట్టు బాగానే సరిపోయారు. అన్ని ఆరవ మొహాలు కావడం మనకు ఇబ్బంది అనిపించేదే

విడుదల తేదీ : ఆగష్టు 31, 2018

రేటింగ్ : 3/5

నటీనటులు : నయనతార, యోగి బాబు, శరణ్య పొన్వన్నన్, శరవణన్, రాజేంద్రన్

దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్

నిర్మాతలు : లైకా ప్రొడక్షన్స్

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫర్ : శివకుమార్ విజయన్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *