అమిత్ పంగల్ చరిత్ర…ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో…

రష్యాలోని ఏక్తరిన్‌ బర్గ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్స్‌షిప్‌లో పసిడి పతకానికి భారత్ అడుగు దూరంలో ఉంది. 52 కేజీల విభాగంలో పోటీపడుతున్న యువ బాక్సర్ అమిత్ పంగల్ అద్వితీయ ప్రదర్శనతో టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. కజకిస్థాన్ బాక్సర్ సాకేన్ బిబోసినోవ్‌ తో సెమీస్‌లో ఢీకొట్టిన అమిత్ 3-2 తేడాతో విజయాన్ని అందుకుని.. బాక్సింగ్ ఛాంపియన్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారత పురుష బాక్సర్‌గా అరుదైన ఘనత సాధించాడు. శనివారం ఫైనల్లో.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ షఖోబిదిన్‌తో అమిత్ ఢీకొననున్నాడు. సెమీస్‌ ఆరంభంలో కాస్త తడబడినట్లు కనిపించిన అమిత్.. మెల్లగా పుంజుకుని ప్రత్యర్థిని తన పవర్ పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ముఖ్యంగా.. ఓవర్ హ్యాండ్ పంచ్‌కైతే.. సాకేన్ బిబోసినోవ్‌ దిమ్మతిరిగిపోయింది. ఆ తర్వాత ఆఖరి వరకూ అమిత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. ఇక 63 కేజీల విభాగంలో పోటీపడిన మనీష్ కౌశిక్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకానికి పరిమితమయ్యాడు. ఫైనల్‌కి చేరడం ద్వారా అమిత్‌కి కూడా పతకం ఖాయమవడంతో ఈసారి భారత్‌కి రెండు పతకాలు రానున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *