బాబును ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమైన కేసీఆర్

అనుకున్నది జరగాలని పట్టుబడట్టడంలో ముందుండే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ దిశలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పెట్టే దిశగా సాగుతున్నారు.  హైదరాబాద్లో ఉన్న ఏపీ సచివాలయ భవన సముదాయాన్ని అప్పగించాలని గతంలో చర్చలు జరిపిన కేసీఆర్ అది సఫలం కాకపోవడంతో ఒకింత వేచి చూసే దోరణి అవలంబించారు. అయితే తాజాగా ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ప్రత్యేకంగా కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో కొన్ని అంశాలపై స్పష్టతలేని కారణంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి తోడందించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఇరు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు రెండు విడతలుగా సమావేశమై చర్చించిన అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా సచివాలయ పునర్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్లో ఉన్న ఏపీ సచివాలయ భవన సముదాయాన్ని అప్పగించాలన్న అంశంపై స్వయంగా చంద్రబాబుతో చర్చించిన విషయాన్ని ఆయన స్పందించిన తీరును కూడా కేసీఆర్ గవర్నర్కు వివరించారు. నూతన సచివాలయాన్ని ఎలాగైనా నిర్మించి తీరాలన్న ప్రభుత్వ ధృడసంకల్పాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 10వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజన పరిణామాలను వివరించారు. 9వ 10వ షెడ్యూల్లలో పొందుపరిచిన సంస్థలు. పరిశోధనా కేంద్రాలు విశ్వవిద్యాలయాలు తదితర విభజన అంశాల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలంటే నిరుపయోగంగా ఉన్న భవనాలను ఇప్పించాలని నరసింహన్ను కోరినట్లు సమాచారం.

ఈ విషయంలో ఏపీ సర్కారు సమన్వయ దోరణితో ముందుకు రాకపోతే విభజన షెడ్యూల్ విషయంలోనూ తాము కిరికిరి పెట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెల 26న మరోసారి ఇరు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు గవర్నర్ అధ్యక్షతన సమావేశం కానున్నందున అప్పటిలోగా ఏపీ సచివాలయం అప్పగింత అంశంపై తుదినిర్ణయం వచ్చే విధంగా ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లి బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అజెండా ప్రభుత్వ ప్రాధాన్యత గల శాఖలు వాటి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. గవర్నర్ ప్రసంగపాఠంలో పొందుపర్చాల్సిన అంశాలను కూడా ప్రస్తావించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *