జలదిగ్బంధనంలో సిటీ, రంగంలోకి కేటీఆర్‌

జంట నగరాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో భారీగా వర్షం పడుతుండటంతో రోడ్లపై వరదనీరు పెద్ద ఎత్తున నిలిచింది. దీంతో పలుచోట్ల  రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. నగరంలోని వర్షబీభత్సం నేపథ్యంలో మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు వెంటనే రంగంలోకి దిగారు. నగరంలోని పరిస్థితిపై అధికారులతో ఆయన చర్చించారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముంచెత్తిన వాన..
నగరంలోని పలు ప్రాంతాలను వరుణుడు గురువారం ఉదయం ముంచెత్తాడు. వర్షం కారణంగా అంబర్‌పేట్‌ 6 నంబర్‌ రోడ్‌, తాజ్‌ ఐలాండ్‌, బేగంబజార్‌ పీఎస్‌, పుత్లిబౌలి, సీబీఎస్‌ బస్‌ స్టేషన్‌, అమీర్‌పేట్‌, ఇమేజ్‌ హాస్పిటల్‌ రోడ్డు, కేసీపీ జంక్షన్‌, నిమ్స్‌, తార్నాక, గోల్నాక, పాత గాంధీ ఆస్పత్రి, నింబోలి అడ్డా, మలక్‌పేట్‌ యశోద ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. హయత్‌నగర్‌లోని కోర్టులోకి, ఫైర్‌స్టేషన్‌లోకి వర్షపునీరు చేరుకుంది.

నగరంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. సింకింద్రాబాద్‌, పంజాగుట్ట, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, జుబ్లీహిల్స్‌, అబిడ్స్‌, మాదాపూర్‌, శేరిలింగంపల్లి, మియాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, పాతబస్తీ, ఖైరతాబాద్‌, చైతన్యపురి, కొత్తపేటలోని పలు ప్రాంతాలు వర్షం ధాటికి జలమయమయ్యాయి. సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌ మెట్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, కుత్బుల్లాపూర్‌, కోఠి, గోషామహల్‌, పాతబస్తీ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

లోతట్టు ప్రాంతాలు బిక్కుబిక్కు!
భారీ వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇక వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం గురువారం పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఇక వనస్థలిపురంలో ప్రహారి గోడ కూలి ఒక మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *