ముంబై వరదలు ఎందుకు వచ్చాయి?

భారీగా వర్షం పడితే నగర వీధులు కుంటలు, చెరవులు అవడం, పౌర జీవితం అస్తవ్యస్తం అవడం అందరికి అనుభవమే. ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడల్లా నెపాన్ని ప్రకతిపైకి నెట్టేయడం పాలకుల పని. అది హైదరాబాదైనా, ముంబై అయినా పెద్ద తేడా ఉండదు. కాకపోతే చిన్న చినుకుకే హైదరాబాద్‌ వీధులు కోనేరు అవుతాయి. కుండపోత వర్షాలకు ముంబై వీధులు చెరువులవుతాయి. ముంబై నగరంలో మంగళవారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 288 మిల్లీమీటర్ల వర్షం కురియడంతో ప్రాణ నష్టం పెద్దగా జరుగకపోయినా నగరంలోని పౌర జీవితం అస్తవ్యస్తం అయింది. ఇందుకు బాధ్యత పూర్తిగా స్థానిక మున్సిపాలిటీ, పాలకులదే.
2005, జూలై 26వ తేదీన 24 గంటల్లో 944 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవడంతో ముంబై నగరం చిగురుటాకులా వణికిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించాయి. పక్కనే సముద్రం, నైసర్గిక స్వరూపం కారణంగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని పాలకులకు తెల్సిందే. అందుకనే ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1985లో బ్రిటిష్‌ ప్రముఖ కన్సల్టెంట్‌ వాట్సన్‌ హాక్షీని పిలిపించి గంటకు 50 మిల్లీ మీటర్ల వర్షం పడినా తట్టుకునేలా పటిష్టమైన నాలా వ్యవస్థకు ప్రణాళికను రూపొందించాలని కోరింది. దాన్ని అప్పుడు ‘బృహముంబై స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజ్‌ రిపోర్ట్’ గా వ్యవహరించారు. ‘బృమ్‌స్టావాడ్’ అని ముద్దుగా షార్ట్‌ ఫామ్‌లో కూడా పిలుచుకున్నారు. అయితే అధికారులు సకాలంలో పని జరిగేలా చూడకపోవడంతో ఆ కన్సల్టెంట్‌ తన ప్రణాళికను రూపొందించి ఇవ్వడానికి ఎనిమిది ఏళ్లు పట్టింది. దాన్ని అరకొరగా అమలు చేయడానికి మున్సిపల్‌ పాలకులను 12 ఏళ్లు పట్టింది. ఫలితంగా 2005లో నగరాన్ని వరదలు మళ్లీ ముంచెత్తాయి.
2005 వరదల అనుభవంతో మున్సిపల్‌ రిటైర్డ్‌ ఇంజనీర్లతో స్థానిక మున్సిపాలిటీ ‘ముంబై వికాస్‌ సమితి’ని ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటర్‌ డ్రైనేజీ వ్యవస్థను మెరగుపర్చేందుకు మరో ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఆదేశించింది. ఆ సమితి నగరంలో వర్షాలు పడే 121 ప్రాంతాలను గుర్తించింది. అందుకనుగుణంగా ఓ ప్రణాళికను రూపొందించింది. దాన్ని అమలు చేసేందుకు 616 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేసింది. వాటిలో 260 కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించి చిన్న చిన్న పనులనే స్థానిక మున్సిపాలిటీ పాలకులు అమలు చేశారు.
వాటర్‌ పింపింగ్‌ స్టేషన్లను నిర్మించడం, రైల్వే కల్పర్ట్‌లను ఏర్పాటు చేయడం, కొత్తగా ఫ్లడ్‌ గేట్లను ఏర్పాటు చేయడం, పాత నల్లాలను మరింత లోతుగా, వెడల్పుగా పునరుద్ధరించడం లాంటి పనుల జోలికి వెళ్లలేదు. మీథి నది ఆక్రమణల తొలగింపునకు ప్రయత్నించలేదు. ముంబైకి సహజ సిద్ధమైన పలు నదులు, కాల్వలు ఉండడం వల్ల వరదల నుంచి త్వరగా కోలుకోగలుగుతుంది. లేకపోతే ప్రాణ, ఆస్తి నష్టాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఏటా 30వేల కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్‌ ఉండే ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ వరద సహాయక చర్యల కింద 200, 300 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది గానీ, వరదలను నివారించేందుకు ముందుగా ఖర్చు పెట్టడానికి మాత్రం ముందుకు రాదు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *