పన్నీర్ మరో వ్యూహం.. నిరాహారదీక్షకు సిద్దం!

చెన్నై: అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళతో వార్ లో చిత్తయిపోయిన పన్నీర్ సెల్వం మరో తాజా ఎత్తుగడకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ, ప్రభుత్వం చిన్నమ్మ గుప్పిట్లోకి వెళ్లిపోగా.. జయలలిత మేనకోడలు దీప సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో.. పన్నీర్ తన కార్యాచరణ పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ.. త్వరలోనే నిరాహార దీక్షకు సిద్దమవ్వాలనే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈ నెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరాహార దీక్షలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

చెన్నైలోని చెపాక్ ప్రాంతంలో దీక్షకు దిగాలని పన్నీర్ ఇప్పటికే భావిస్తుండగా.. ఆయనకు మద్దతుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో దీక్షకు దిగుతారని తెలుస్తోంది. దీక్షలకు అనుమతి కోరుతూ చెన్నై నగర పోలీసు కమిషనర్ ఎస్.జార్జ్ కి పన్నీర్ మద్దతుదారు, మాజీ మంత్రి మధుసూదన్ లేఖ ఇచ్చారు. దీంతో పోలీసులు అనుమతివ్వడమే తరువాయి పన్నీర్ దీక్ష చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

పన్నీర్ సీఎంగా ఉన్న సమయంలో జయ మృతిపై విచారణకు ఆదేశాలు జారీ చేసినా.. పూర్తి స్థాయిలో అది కార్యరూపం దాల్చలేదని కమిషనర్‌కు లేఖ ఇచ్చిన సందర్బంగా మధుసూదన్ చెప్పుకొచ్చారు. కాగా, దీక్ష ద్వారా మరోసారి అన్నాడీఎంకె రాజకీయాలను ప్రభావితం చేసి ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవాలనే ఆలోచనలో పన్నీర్ సెల్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *