కేసీఆర్ డైలాగ్ ను వాడేసిన ఏపీ మంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో పదే పదే చెప్పిన మాటనే ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత తన కీలక స్టేట్ మెంట్ కు ఉపయోగించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో – ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చే సమయంలో సైతం కేసీఆర్ ప్రసంగిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటుగా ఇవ్వనివి సైతం నెరవేర్చిన ఘనత తమదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు సేమ్ టు సేమ్ అదే డైలాగ్ ను పరిటాల సునీత తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయంలో ఉపయోగించారు. పులివెందులకు నీటి సరఫరా విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన విమర్శలను పరిటాల సునీత ప్రస్తావిస్తూ నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించిన ఘనత చంద్రబాబుది అయితే జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసిన చరిత్ర వైఎస్ జగన్ దని ఆరోపించారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 70శాతం హామీలను అమలుచేయడమే కాకుండా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా చంద్రబాబునాయుడు అమలుచేస్తున్నారని సునీత ప్రశంసించారు. పట్టిసీమ ద్వారా రూ.2500 కోట్ల విలువైన పంటలను కాపాడారని – రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ ఉద్యానవన రైతులకు కూడా రుణమాఫీ – యువతకు ఉద్యోగ – ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. 44లక్షల మందికి పెన్షన్లు అందించడం – రైతు రుణమాఫీ రూ.24వేల కోట్లు – డ్వాక్రాకు రూ.10వేల కోట్లను మాఫీ చేయడం జరిగిందని వివరించారు.  ఓవైపు సంక్షేమం – మరోవైపు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వివరించారు. దోచుకోవడం – దాచుకోవడం – అభివృద్ధిని అడ్డుకోవడం – హత్యా రాజకీయాలు తప్ప జగన్ కు ఏమీ తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో తన అడ్రస్ గల్లంతవుతుందనే అక్కసుతోనే నిత్యం విషం వెళ్లగక్కుతున్నారని పరిటా సునిత విమర్శించారు.

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను అహర్నిశలు కష్టపడి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రతిపక్షం నిత్యం వెళ్లగక్కుతోందని పరిటాల సునీత మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు నీళ్లు తీసుకురావడంతో వారి కాళ్ల కింద భూమి కదిలి భయకంపితులవుతున్నారని ఉనికి కోసం ముఖ్యమంత్రిపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి వేలకోట్ల రూపాయలను దిగమింగిన జగన్కు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని మండిపడ్డారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *