పదవికి రాజీనామా చేసిన కర్ణాటక స్పీకర్

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ కే.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా రాష్ట్రంలో సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్‌ సోమవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. కన్నడనాట కమలనాథులు బల పరీక్షలో నెగ్గిన కాసేపటికే స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌ కృష్ణారెడ్డికి సమర్పించారు. సభలోనే ఆయన రాజీనామా లేఖను సభ్యులందరికీ చదవి వినిపించారు. కాగా స్పీకర్‌ రాజీనామాకు ఒక్కరోజు ముందు (ఆదివారం) 14 మంది సభ్యులపై అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి.. సభా నియమాలను ఉల్లంఘించినందుకు వారిపై వేటు వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని ఇచ్చిన అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు.  దీంతో ఇప్పటి నుంచి తాత్కాలిక స్పీకర్‌గా కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు

ఆయన మాట్లాడుతూ ‘14నెలల 4 రోజుల పాటు నేను స్పీకర్‌గా పనిచేశాను.నన్ను అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక స్పీకర్‌లా కాకుండా ప్రజల కోణంలో ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకున్నాను. నా విధిని 100% నిర్వర్తించానని గర్వంగా చెప్పుకోగలను. నా వైపు నుంచి సభలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే నన్ను క్షమించండి. నా మాటలు, చేతల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మన్నించండి.సోనియాజీ నన్ను పిలిచి స్పీకర్‌గా ఉండాల్సిందిగా కోరారు. ఆమె నన్ను ఆదేశించలేదు. అభ్యర్థించారు. నాకు అసక్తి ఉంటేనే కొనసాగమని చెప్పారు. నాకు పార్టీలో అంత స్వేచ్ఛ లభించింది.  నాకు తెలిసి స్పీకర్‌గా ఉండటం నా జీవితంలో అతి పెద్ద పురోగతి’ అని చెప్పి ముగించారు.

కాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి అనంతరం.. స్పీకర్‌ను దింపేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్‌ కే.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం సభలో జరిగిన విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్‌ విజయం సాధించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *