అతడితో సినిమా తీస్తా.. డైలాగ్స్ వినపడకుండా అరుపులతో దద్దరిల్లుతుంది.. రాజమౌళి

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చిత్రంలో ఒక సీన్‌లోనైనా కనిపించాలని ఏ హీరోనైనా కోరుకుంటారు. ఇక సినిమా అయితే బంపర్ లాటరీ తగిలినట్టు. బాహుబలి2 విడుదల తర్వాత జక్కన సినిమా ఎవరితో అనే చర్చ మొదలైంది. అయితే రాజమౌళి మాత్రం బాహుబలి సినిమా కాకుండా ఓ సింపుల్ మూవీ తీస్తాను అని ఇప్పటికే హింట్ ఇచ్చాడు. తాజాగా బాహుబలి2 ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి స్టూడెంట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా తీస్తాను అని ఓ మాట చెప్పాడు. కొన్ని విషయాలు ఆయన మాటల్లోనే..

నాకు టాలీవుడ్, బాలీవుడ్ అనే పదాలు ఇష్టం ఉండదు. తెలుగు సినీ పరిశ్రమ, హిందీ సిని పరిశ్రమ, తమిళ సినీ పరిశ్రమ అనడమే నాకు చాలా ఇష్టం. ఇండియన్ సినిమా అని పిలువడం నాకు ఇష్టం ఉండదు అని రాజమౌళి పేర్కొన్నారు. హాలీవుడ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు. ఇండియాలోనే సినిమాలు తీస్తాను అని జక్కన తెలిపాడు

ఇటీవల అమెరికాలో పర్యటించాను. హాలీవుడ్‌లో సినీ నిర్మాణ శైలిని చూశాను. అక్కడ అనుసరిస్తున్న విధానాలు, నేను సినిమాలు తీసే పద్ధతికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే నేను హాలీవుడ్‌కు సరిపోను అని నిర్ణయించుకొన్నాను. ఇండియాలోనే ఉంటూ ఆ స్థాయి సినిమాలు తీస్తాను అని రాజమౌళి చెప్పాడు.

మగధీర, బాహుబలి సినిమాల్లో నాకు బాహుబలి అంటేనే ఇష్టమని రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక ప్రభాస్, తారక్‌లో ప్రస్తుతం ప్రభాస్ అంటేనే ఇష్టం. కానీ స్నేహితుడిగా తారక్‌ను చాలా ఇష్టపడుతాను అని రాజమౌళి జవాబిచ్చారు.
నేను తీసిన సినిమాలలో మర్యాద రామన్న చిత్రం నాకు చాలా ఇష్టం. మిగితా సినిమాల్లో మాయాబజార్, బ్రేవ్ హార్ట్ సినిమాలు నా ఫేవరేట్. నాకు నచ్చిన నటుల్లో బ్రూస్ లీ, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌ను ఇష్టపడుతాను. బ్రూస్‌లీ నటన అంటే నన్ను ఆకట్టుకొన్నది అని రాజమౌళి అన్నారు.

దక్షిణాదిలో రజనీకాంత్‌తో సినిమా చేయాలనుకొంటున్న దర్శకుల్లో నేను ఒకరిని. నేను రజనీతో ఎలాంటి సినిమా చేస్తానో తెలియదు. కానీ ఒకవేళ రజనీతో సినిమా చేస్తే కనీసం పదిరోజులు థియేటర్లలో డైలాగ్స్ ఏంటో అర్థం కావొద్దు. సినిమా మొదలైన దగ్గరి నుంచి సినిమా అయిపోయే దాకా ప్రేక్షకుల అరుపులు, కేరింతలతో సినిమా హాల్ దద్దరిల్లి పోవాలి అని రాజమౌళి తెలిపారు.

గరుడ అనే సినిమా ప్రస్తుతం నా మదిలో ఉంది. ఇంకా సినిమా స్క్రిప్ట్‌పై క్లారిటీ లేదు. ఇందులో మోహన్‌లాల్‌ నటిస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేను. కథ మొత్తం తయారయ్యాక సినిమా చేస్తాను. మోహన్‌లాల్ గొప్ప నటుడు, వీలు చిక్కితే ఆయనతో సినిమా తీయడం ఖాయం అని రాజమౌళి అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *