అమరావతిలో అదరగొట్టేలా జక్కన్న ఐడియా.. తెలుగుతల్లిపై సూర్య కిరణాలు!

ఏమైనా జక్కన్న జక్కన్నే. చిన్న విషయాన్ని దృశ్యంలో తనదైన సత్తాను అద్భుతంగా చెప్పే అలవాటు జక్కన్నకు మొదటి నుంచి ఉన్నదే. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో నిర్మించే అసెంబ్లీ భవనానికి సంబంధించిన డిజైన్ కు సలహాలు సూచనలు ఇవ్వాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరటం తెలిసిందే.

తాజాగా తాను ఇచ్చిన ఐడియాలో ఒకదానిని చంద్రబాబు ఓకే చేశారంటూ.. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రాజమౌళి.  2.29 నిమిషాల నిడివి ఉన్న పొట్టి వీడియోలో తన ఆలోచనను స్పష్టంగా చెప్పటమే కాదు.. విజువల్ గా అదెలా ఉంటుందో చూపించి అదరగొట్టేశారు.

ఇంతకీ జక్కన్న ఇచ్చిన ఐడియా ఏమిటంటే.. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఏడాదికి రెండుసార్లు ఉత్తరాయణం నుంచి దక్షిణాయణంలోకి మారేటప్పుడు.. మళ్లీ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారేటప్పుడు తెల్లవారుజామున ఆరు గంటల వేళలో సూర్యకిరణాలు నేరుగా అరసవెల్లి స్వామి వారి మీద పడటం తెలిసిందే. ఈ దృశ్యాన్ని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు ఈ రెండు కాలాల్లో ఆలయానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇలాంటి చిత్రమే గుడిమల్లన్న పరశురామ టెంపుల్లో చోటు చేసుకుంటుందని.. దాన్ని స్ఫూర్తిగా చేసుకొని ఏపీ అసెంబ్లీలో ఇలాంటి విధానాన్నే అమర్చాలన్న ఐడియాను ఇచ్చారు.

ఇందుకు మూడు అద్దాలు.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అవసరమని.. ఉదయం 9 గంటలకు సూర్యుడి కిరణాల్ని స్వీకరించే మొదటి అద్దం ఆ కిరణాల్ని రెండో అద్దానికి ఇస్తుంది. ప్రతి రోజు ఉదయం 9.15 గంటలకు రెండో అద్దం నుంచి మూడో అద్దంలోకి సూర్య కిరణాలు పడి.. అవి అసెంబ్లీ సెంటర్ హాల్లో ఏర్పాటు చేసే తెలుగు తల్లి విగ్రహం మీద పడతాయి.

తాను చెప్పిన ఐడియా ఎలా ఉంటుందో విజువల్ ఎఫెక్ట్స్ తో చూపించారు. ఎప్పుడైతే సూర్యకిరణాలు తెలుగు తల్లి విగ్రహం మీద పడ్డాయో.. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ పాట మొదలవుతుంది. చూసినంతనే కనెక్ట్ అయ్యే ఈ ఐడియాను చంద్రబాబు ఓకేచేసినట్లు చెప్పారు. రాజమౌళి బాహుబలి 2 తర్వాత ఆయన తయారు చేసిన ఈ పొట్టి వీడియోలో ఆయన మార్క్ ఉద్వేగం.. భారీతనం.. విస్మయాన్ని కలిగించే అంశాలు చాలానే ఉన్నాయి. కావాలంటే.. వీడియోను కాస్త చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *