ఢిల్లీ యువకుల కర్కశత్వం చూశారా?

మనుషులు – శునకాలకు ఉన్న అవినాభావ సంబంధమే వేరు! పిల్లలు లేని కొంతమంది వీటిని తమ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. వాటికి కొంత ప్రేమను పంచితే చాలు.. ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. ఆప్యాయత పంచుతాయి. కానీ అటువంటి మూగజీవాలను హింసించి పైశాచిక ఆనందం పొందే వారు ఇంకా  వెలుగులోకి వస్తున్నారు. గత ఏడాది జూలైలో చెన్నైలో ఇద్దరు మెడికోలు చిన్న కుక్క పిల్లను మేడ పై నుంచి విసిరేసిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. వీరి చర్యలపై కోర్టులు కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే! అయితే అడపాదడపా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా.. అవి వెలుగులోకి రావడం లేదు.  ప్రస్తుతం దక్షిణ ఢిల్లీలో ఇటువంటి హేయమైన సంఘటనే జరిగింది.

కుక్క మాంసం కోసం నలుగురు యువకులు దానిని దారుణంగా చంపేసిన దుర్ఘటన సీసీ కెమెరాలకు చిక్కింది. 71వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొన్న రోజే ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ సెంటర్ లో రాత్రి సమయంలో  ఒక కుక్క ఒక దుకాణం ముందు నిద్రిస్తోంది. అటు వైపు ముగ్గురు యువకులు వచ్చారు. వారిలో ఒకడు.. పక్కనే ఉన్న రాయితో నిద్రిస్తున్న శునకం తలపై గట్టిగా కొట్టాడు. అది మరోసారి కదలకుండా.. అలా కర్కశకంగా కొడుతూనే ఉన్నాడు. ఇంతలో రెండో వ్యక్తి కూడా రాయి తీసుకుని కొట్టడం మొదలుపెట్టాడు. పాపం ఆ దెబ్బలకు తాళలేక ఆ జీవి అక్కడికక్కడే మృతిచెందింది. ఇంతలో తెలుపు రంగు దుస్తుల్లో ఉన్న మూడో వ్యక్తి దాని కాళ్లు పట్టుకుని ఈడ్చేసి.. రెండు దుకాణాల మధ్య గల ప్రదేశంలోకి విసిరేశాడు.

ఆ తర్వాత చనిపోయిన కుక్కను ఓ ప్లాస్టిక్ కవర్ లో వేసుకుని వెళ్లే క్రమంలో అక్కడి స్థానికులు తమను గమనిస్తున్నారని గుర్తించిన దుండగులు… చనిపోయిన కుక్క ఎక్కడ కనిపిస్తుందోనని భయపడిపోయారు. వెంటనే కాస్తంత దళసరిగా ఉన్న కవర్ ను దొరికించుకున్న వారు… చనిపోయిన కుక్కను అందులో వేసుకుని అక్కడి నుంచి క్షణాల్లో మాయమైపోయారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ స్థానికుడు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఆ దుండగుల కర్కశత్వం మొత్తం రికార్డైపోగా… ఇప్పుడు వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *