‘శ్రీదేవిని చంపింది భారత మీడియానే..!’

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను, కుటుంబసభ్యులను, తోటి నటీనటులను వదిలి కానరాని దూరాలకు అందాలనటి శ్రీదేవి తరలివెళ్లారు. దశాబ్ధాల పాటు వెండితెరను ఏలిన అతిలోక సుందరి ఇక జ్థాపకాల్లోనే మిగిలిపోయింది. వేలాదిమంది అశ్రునయనాల మధ్య బుధవారం శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. తన నటన, అందం, అభినయం, హావభావాలతో కోట్లాది హృదయాల్లో నిలిచిపోయిన శ్రీదేవి అకాలమరణం ఎంతోమందిని కలిచివేసింది. దుబాయ్‌లో జరిగిన వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి గత శనివారం ప్రమాదవశాత్తూ హోటల్‌ గదిలో మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి ఇకలేరు అని తెలిసిన క్షణం నుంచి, ఆమె పార్థీవ దేహం ముంబై చేరుకునే వరకు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలోనే ఆమె ఆకస్మిక మృతి కథనాల విషయంలో జాతీయ మీడియా సంస్థలతో పాటు, స్థానిక మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహం ప్రదర్శించాయి.  అయితే ఇదే అంశంపై దుబాయ్‌కి చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ఖలీజ్‌ టైమ్స్‌ స్పందించింది. శ్రీదేవి మరణంపై భారతీయ మీడియా వ్యవహరించిన తీరును ఆ సంస్థ తప్పుబట్టింది. శ్రీదేవిని ఆ దేశ మీడియానే హత్య చేసిందనే అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న ఓ వ్యక్తి మరణంపై నిజానిజాలు తెలుసుకోకుండా.. అత్యుత్సాహం, అసత్య కథనాలు ప్రచారం చేశారని ఖలీజ్‌ టైమ్స్‌ గురువారం ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ఆ సంస్థ దాదాపు భారతీయుల పరువును తీసింది. భారత్‌లోని చాలామంది ఇళ్లలో బాత్‌ టబ్‌లు ఉండవని, వాటి వాడకం గురించి వారికి తెలియదని అవహేళన చేసింది.

మొదట శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్‌లో గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని దుబాయ్‌ పోలీసులు తేల్చారు. అయితే, ఆ సంఘటనపై అసలేం జరిగిందో తెలుసుకోకుండానే శ్రీదేవి డెత్‌ మిస్టరీ అంటూ తమ డిటెక్టివ్‌ కథనాల ప్రసారాన్ని, బాత్‌ టబ్‌లో సన్నివేశాలను చూపుతూ భారత మీడియా అత్యుత్సాహం చూపడాన్ని ఖలీజ్‌ టైమ్స్‌ విమర్శించింది.

అన్నీ టీవీ ఛానెళ్లు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి బాత్‌టబ్‌లో సీన్స్‌ను చిత్రీకరించడంపై విచారం వ్యక్తం చేసింది. అదే విధంగా రాజకీయ ప్రముఖులైన సుబ్రమణ్య స్వామి, అమర్‌ సింగ్‌లు శ్రీదేవి మృతిపై చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ కథనంలో పేర్కొనడం గమనార్హం. సంఘటన జరిగినప్పటి నుంచి తమ సంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నించారని.. కానీ భారతీయ మీడియా తమ సమాచారాన్ని వక్రీకరిస్తూ విభిన్న కథనాలను ప్రసారం చేసిందని ఖలీజ్ వెల్లడించింది.

దుబాయ్‌లో శ్రీదేవి మరణం ప్రమాదవశాత్తూ అని తేలినా.. కొంతమంది జర్నలిస్టులు ఆమె మృతి వెనుక ఇదే రహస్యమంటూ.. కాస్మోటిక్‌ సర్జరీలు, శరీరంలో ఆల్కహాలు జాడలు ఉన్నాయనే కథలు అల్లడం తమను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపింది. ఇలాంటి ఘటనలను మానవతా దృక్పథంతో చూడాలని, కానీ కొన్ని న్యూస్‌ ఛానెళ్లు మరీ అత్యుత్సాహంతో వెర్రితలలు వేసి శ్రీదేవిని హత్య చేశాయన్న వ్యాఖ్యలు చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *