‘యోగి’ ఆ మచ్చను తొలగించుకో!: తండ్రి సలహా

లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ఏదొక విషయంతో వార్తల్లో నానుతూనే ఉన్నారు. మతతత్వ వ్యక్తిగా ముద్రపడ్డ యోగి ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో.. పాలనలో పక్షపాత వైఖరి కొనసాగే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం యోగి తండ్రి ఆయనకు ఓ విలువైనన సలహా ఇచ్చారు. హిందుత్వ ప్రచారకుడు అన్న ముద్రను చెరిపేసుకోవాల్సిన అవసరముందని యోగికి 84ఏళ్ల ఆయన తండ్రి బిష్త్ సూచించారు. రిటైర్డ్ అటవీశాఖ అధికారి అయిన ఆనంద్ సింగ్ బిష్త్ ప్రస్తుతం భార్య సావిత్రితో కలిసి పౌరి జిల్లా పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన ఆయన యోగిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న సీఎంగా అందరిని కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత యోగిపై ఉందని బిష్త్ గుర్తుచేశారు. యోగికి ఓటు వేసినవారిలో కేవలం హిందువులే కాదని, బుర్ఖా ధరించిన మహిళలు కూడా ఉన్నారన్న విషయం గుర్తెరగాలన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ.. అందరి మనసులను గెలుచుకోవాలని యోగికి తండ్రి సూచించారు. ముస్లిం మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ట్రిపుల్ తలాక్..ఇతర సమస్యలపై బీజేపీ ఆదుకుంటుందని వారు ఓటు వేశారు. కాబట్టి అన్ని విశ్వాసాలకు చెందిన ప్రజలను బీజేపీ, యోగి ప్రగతిపథంలో నడిపించాల్సిన అవసరముందని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం బాధ్యతలు నెరవేర్చాలన్నారు. యోగికి తండ్రి బిష్త్ మరో ముఖ్యమైన సూచన కూడా చేశారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రజలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేయవద్దని చెప్పారు. చివరగా, యోగి చిత్తశుద్దితో పనిచేస్తాడన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *