తెలంగాణలో సంక్షేమం భేష్‌

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా ఉన్నాయని 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ ప్రశంసించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీరు అందించే ప్రయత్నాన్ని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచుకుంటుండటం మంచి పరిణామమన్నారు. దృష్టిసారించాల్సిన అంశాలను వివరించడంతో బాటు చక్కగా అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆయన తెలియజేశారు. ఆర్థిక సంఘం మూడు రోజుల పర్యటన అనంతరం మంగళవారం హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. క్షేత్ర పర్యటనతో బాటు స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ చర్చించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన అన్ని అంశాలను పరిశీలిస్తామన్నారు. సొంత పన్నుల రాబడిలో రాష్ట్ర వృద్ధిరేటు బాగుందని అన్నారు.
రాష్ట్రం స్థూల ఉత్పత్తిలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల వాటా 52 శాతంగా ఉందని పేర్కొంటూ అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించారు. రుణాలు, ద్రవ్యలోటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విధానం అనుసరించాలన్నారు. తెలంగాణలో ద్రవ్యలోటు 2015-16లో 3.26 శాతం ఉండగా, 2016-17కు 5.35 శాతానికి పెరిగిందన్నారు. ఉదయ్‌ స్కీంకు రూ.7500 కోట్లు బదిలీ చేయడం మినహాయిస్తే ఇది 4.22 శాతంగా ఉందన్నారు. 2017-18 సవరించిన అంచనాల ప్రకారం 3.12 శాతానికి తగ్గిందన్నారు. ప్రభుత్వం రెవెన్యూ మిగులును చూపగా కాగ్‌ 2016-17లో రెవెన్యూ లోటును రూ.5,392గా పేర్కొందని అన్నారు.

 

సొంత పన్నుల రాబడిలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ ముందుందన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పన్నుల రాబడి తెలంగాణలో 7.34 శాతం ఉండగా, మిగిలిన 29 రాష్ట్రాల సగటు 6.27 శాతంగా ఉందన్నారు. పెట్టుబడి వ్యయం బాగుందన్నారు. 2015-16, 2017-18 మధ్య పెట్టుబడి వ్యయం 27శాతంగా ఉందని తెలిపారు. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వచ్చిన తర్వాత ఆరంభంలో రెండు నెలలు మినహా రాష్ట్రం కేంద్రం నుంచి పరిహారం తీసుకోలేదని పన్నుల రాబడి పెంచుకున్న తీరు బాగుందన్నారు. పారిశ్రామిక అనుమతులకు టీఎస్‌ఐపాస్‌ అనే చక్కటి విధానాన్ని అమల్లోకి తెచ్చిందని ప్రశంసించారు. మిషన్‌భగీరథ పైపు లైన్లతో బాటు ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేయడం భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *