వరుడు లేకుండానే జరిగిపోయిన పెళ్లి…!

చెన్నై: సాధారణంగా పెళ్లంటే వధువు, వరుడు ఉంటేనే జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం వరుడు లేకుండానే పెళ్లి జరిగిపోయింది. తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో శుక్రవారం జరిగిందీ విచిత్రం. అదీ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.

వివరాల్లోకి వెళితే.. పద్మనాభపురానికి చెందిన సోఫియాకు, పేచ్చిపారైకి చెందిన అజారుద్దీన్‌కు కొద్ది రోజులకు ముందు ముస్లిం సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం జరిగింది. అజారుద్దీన్ సౌదీలో ఓ ప్రైవేటు సంస్థలో కంప్యూటర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

శుక్రవారం పద్మనాభపురంలోని ఓ కళ్యాణ మండపంలో వీరిరువురి పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. గురువారం అజారుద్దీన ఇండియాకు వచ్చేందుకు సౌదీ విమానాశ్రయానికి కారులో బయలుదేరాడు. ట్రాఫిక్‌ రద్దీ కారణంగా సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోయాడు.

దీంతో అతడు ఫ్లైట్‌ మిస్సయ్యాడు. పెళ్లి ముహూర్తానికి వరుడు అజారుద్దీన్ రాలేడని తెలుసుకున్న ఇరువైపు బంధువులు నిరాశ చెందలేదు. వరుడు లేకపోయినా పర్వాలేదు.. పెళ్లి జరిపి తీరుతామంటూ ప్రకటించారు. అనుకున్నదే తడవుగా.. వధువు సోఫియా మెడలో అజారుద్దీన్ చెల్లెలు సూత్రధారణ చేసింది. పెళ్లికి విచ్చేసినవారంతా వధువును ఆశీర్విదించి, కానుకలు అందజేశారు. ముస్లిం మత సంప్రదాయం ప్రకారం వధువు, వరుడు అంగీకార పత్రాలపై సంతకాలు పెడితేనే సగం పెళ్లయినట్లని, కనుక సోఫియాకు జరిగింది పెళ్లిగానే పరిగణిస్తామని పెద్దలు స్పష్టం చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *