పటేల్‌పై అమిత్‌ షాకు అంత కక్ష ఎందుకు?

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆ అంశానికి మాత్రమే మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, అలా ఎందుకు జరగలేదు? గుజరాత్‌ నుంచి రాజ్యసభకు మంగళవారం ఎన్నికలు అత్యంత సాదాసీదా జరగాల్సి ఉండగా, ఆద్యంతం ఎందుకు ఉత్కంఠభరితంగా సాగాయి ? అమిత్‌ షా విజయాన్ని కీర్తించాల్సిన పత్రికల పతాక శీర్షికలు అహ్మద్‌ పటేల్‌ ఐదవసారి విజయానికి ఎందుకు పట్టంగట్టాయి? అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధేయుడు, పార్టీ వ్యూహకర్త అమిత్‌ షా వర్సెస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌గా పోటీ జరగడమే కారణమా? రాజకీయ చాణక్యంలో ఎవరిది పైచేయో తేల్చేసే ఎన్నికలు అవడం వల్లనా! వీరిద్దరి మధ్య రాజకీయ పోటీ వ్యక్తిగత పోటీగా మారడానికి కారణాలేమైనా ఉన్నాయా? ఇంతకు విజయం ఎవరిది?

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికలు ప్రాధాన్యత ఏర్పడింది. అసెంబ్లీలోని బలబలాల ప్రకారం అధికార బీజేపీకి రెండు సీట్లు, కాంగ్రెస్‌ పార్టీకి ఒక సీటు సులభంగా గెలుచుకునే అవకాశం ఉంది. రెండు సీట్లకు బీజేపీ అమిత్‌షా, స్మతి ఇరానీ పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ, 2001 నుంచి సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఉంటూ చక్రం తిప్పుతున్న అహ్మద్‌ పటేల్‌ను బరిలోకి దించింది.

ఈ ఎన్నికలు సాదాసీదాగా జరగుతాయని, ఇటు అమిత్‌ షా, అటు అహ్మద్‌ పటేల్‌లు విజయం సాధిస్తారని రాజకీయ, మీడియా వర్గాలు భావించాయి సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్‌ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు శంకర్‌సింహ్‌ వఘేలా పార్టీకి గుడ్‌బై చెప్పడం, ఆ తర్వాత ఆయన  ఆరుగురు విదేయులు పార్టీకి రాజీనామా చేయడంతో అమిత్‌ షా బుర్రలో కొత్త ఆలోచన పుట్టింది. పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ అసమ్మతి నాయకుడు బల్వంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ను అమిత్‌ షా రాజ్యసభకు నిలబెట్టారు.

దీంతో కంగారు పడిన కాంగ్రెస్‌ పార్టీ తన గుజరాత్‌ ఎమ్మెల్యేలను కర్ణాకకలోని ఓ రిసార్ట్‌కు తరలించింది. అయినప్పటికీ 15 కోట్ల రూపాయల చొప్పున తమ పార్టీ ఎమ్మెల్యేలకు కొనేందుకు అమిత్‌ షా ప్రయత్నించారని శక్తిసింహ్‌ గోయిల్‌ లాంటి కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆశ్రయం ఇచ్చిన బెంగళూరు రిసార్ట్‌ యజమాని, కాంగ్రెస్‌ మంత్రి ఇంటిపై, రిసార్ట్‌పై సీబీఐ దాడులు జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే సీబీఐ దాడులు చేయించిందనే ఆరోపణలు బలంగా వచ్చాయి.

గుజరాత్‌ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఇన్ని మలుపులు ఉన్నాయి కనుక సాదాసీదాగా జరగాల్సిన ఎన్నికలు ఆద్యంతం రసవత్తరంగా కొనసాగాయి. అహ్మద్‌ పటేల్‌ను లక్ష్యంగా చేసుకొని అమిత్‌ షా ఎందుకు ఇంత తెగింపుకు దిగారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం మిగిలే ఉంది. 2010లో జరిగిన షొహ్రాబుద్దీన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో తనను జైలుకు పంపించారన్న కక్షతోనే అమిత్‌ షా, పటేల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది.

పటేల్‌ పన్నిన చక్రవ్యూహంలో భాగంగానే నాడు సీబీఐ తనను కేసులో అరెస్ట్‌ చేసిందన్నది అమిత్‌ షా నమ్మకం. అమిత్‌ షా వ్యక్తిగతంగా తనపై కక్ష పెంచుకున్నారని అహ్మద్‌ పటేల్‌ గత నెలలో బహిరంగంగా వ్యాఖ్యానించడం, అహ్మద్‌ పటేల్‌పై కక్షకు   షోహ్రాబుద్దీన్‌ కేసులో అమిత్‌ షాను జైలుకు పంపించడమే కారణమని సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం.

వరుసగా రాజ్యసభకు నాలుగుసార్లు విజయం సాధించిన అహ్మద్‌ పటేల్‌ను ఓడించినట్లయితే ఇటు తన వ్యక్తిగత కక్ష తీరినట్లు ఉంటుందని, ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయంతో తీవ్రంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీకి నైతిక స్థయిర్యం కూడా లేకుండా పోతుందని అమిత్‌ షా భావించినట్లు అర్థం అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల విజయంతో దక్కిన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరుతుందని ఆయన భావించినట్లున్నారు. ఇంతకు ఈ పోరాటంలో విజేతలెవరు? పార్టీ ఎమ్మెల్యేలను తనవెంట ఐక్యంగా ఉంచేందుకు అహ్మద్‌ పటేల్‌ అలియాస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేసినా చివరకు ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజ్‌పుత్‌కు ఓటేసినట్లు వీడియో సాక్షిగా చూపించారు.

అందుకు వారి ఓట్లను రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వాటిని ఓట్లుగా పరిగణించాల్సిందేనంటూ బీజేపీ పార్టీ ఏకంగా ఐదుగురు కేంద్ర మంత్రులను ఎన్నికల కమిషన్‌ వద్దకు రాయబారం పంపింది. తీవ్ర ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణం మధ్య చర్చోప చర్చలు జరిపిన ఎన్నికల కమిషన్‌ చివరకు  ఎన్నికల నిబంధనలకు శిరసావహిస్తూ ఇద్దరు రెబెల్‌ కాంగ్రెస్‌ శాసన సభ్యుల ఓట్లు చెల్లదని ప్రకటించడంతో అహ్మద్‌ పటేల్‌కు అంతిమ విజయం లభించింది. ఇంతకు విజేతలెవరో విజ్ఞులకు తేల్చి చెప్పాల్సిన అవసరం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *