ఇంతకీ ఏ చంద్రుడిలో మార్పు వచ్చిందంటారు?

చెబితే అర్థం కాదు.. అనుభవంలోకి వస్తే కానీ తత్త్వం బోధ పడదని ఊరికే అనలేదేమో. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్ల తీరు చూస్తే ఇట్టేఅర్థమవుతుంది. రెండు రాష్ట్రాల మధ్య విభజన జరిగి దాదాపు రెండున్నరేళ్లకు పైనే పట్టింది. ఈ రోజుకు విభజనకు సంబంధించి అంశాలు రెండు రాష్ట్రాల మధ్యన చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిని పరిష్కరించుకోవాలంటే.. ఎవరోపెద్ద మనిషి వద్దకు వెళ్లే కన్నా.. పట్టువిడుపులు ప్రదర్శిస్తే అంతకు మించిన పని ఇంకేం ఉండదు. కానీ.. విభజన కాకలో ఎవరికి వారు బిగుసుకుపోవటంతో చిక్కుముడులు అంతకంతకూ ఎక్కువయ్యాయే తప్పించి తగ్గలేదనే చెప్పాలి.

రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. అయితే.. వీటి పరిష్కారం కోసం ఢిల్లీ వైపు చూసిన తీరే ఎక్కువగా కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం విడిపోతే.. ఇరువురు అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకోవటం.. ఇరువురూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శిస్తే అసలు పంచాయితీనే ఉండదు. ఇందులో ఒకరికి కాస్త స్వార్థంఎక్కువగా ఉన్నా.. రెండోవాళ్లు సర్లే.. కానివ్వమని అనుకుంటే ఇష్యూలు క్లోజ్ అవుతాయి. కానీ.. అలాంటివేమీ లేనప్పుడు మధ్యవర్తి తప్పనిసరిగా ఎంట్రీ ఇవ్వక తప్పదు.

తెలుగు రాష్ట్రాల విభజనలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. విభజన తర్వాత నెలకొన్న అంశాల్ని పరిష్కరించుకునే విషయంలో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ కాస్తంత దూకుడ్ని ప్రదర్శించారనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న నేపథ్యంలో.. తాము అనుకున్నవన్నీ..అనుకున్నట్లే సాధించుకోవాలన్న తీరు బాబుతో పోలిస్తే.. కేసీఆర్ లో కాస్త ఎక్కువగా కనిపించేది.

దీంతో.. సమస్యలు ఇరువురు కూర్చొని మాట్లాడుకొని.. సెటిల్ చేసుకునే స్థానే..మధ్యవర్తిగా ఢిల్లీని.. కోర్టుల్ని ఆశ్రయించిన పరిస్థితి. ఇలాంటివి మొదట్లో బాగానే ఉన్నా.. కాలం చికాకుల్ని తెచ్చి పెడుతుందన్న విషయం అర్థమయ్యే పరిస్థితి. విభజన ఇష్యూల పరంగా చూసినప్పుడు ఏపీతో పోలిస్తే.. తెలంగాణకు ఇబ్బంది ఎక్కువని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు సెక్రటేరియట్ లోని భవనాలు ఖాళీచేయాలన్నా.. హైకోర్టు విభజన జరగాలన్నా ఏపీ సర్కారు తోడ్పాటు తప్పనిసరి.ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు కేసీఆర్ కు కాస్త ఎక్కువ సమయమేపట్టింది. లిటిగెంట్ వ్యవహారాలు అనుకున్నంత సులువుగా పూర్తి కావని..అధికారం చేతిలో ఉంటేనే సరిపోదన్న విషయంతో పాటు.. తాను అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఎంతోకొంత.. ఎక్కడో ఒక దగ్గర రాజీపడక తప్పనిసరి  అన్న వాస్తవం ఆయనకు అర్థమైంది. దీంతో.. కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. పంచాయితీల కోసం ఢిల్లీ బాట పట్టొద్దన్న నిర్ణయానికి వచ్చారు.

సమస్యల్లో ఉన్న వాడు వాటిని తీర్చుకోవాలన్న తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. కానీ.. తీర్పు చెప్పేవాడికి ఆ తొందర ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన ధర్మాన్ని తాను నూటికి నూరుశాతం నిర్వర్తించాలన్న ఆలోచన తప్పించి మరింకేమీ ఉండదు. ఇక్కడే చిక్కులన్నీ. ఆ విషయాన్ని అర్థంచేసుకున్న కేసీఆర్.. కేంద్రం మీదా.. కోర్టుల మీద ఆధారపడకూడదని డిసైడ్ కావటమే కాదు.. గవర్నర్ ను పెద్ద మనిషిగా పెట్టుకొని ఇష్యూలను క్లోజ్ చేసుకుంటే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెప్పాలి. కొత్త సెక్రటేరియట్ నునిర్మించాలంటే..విభజనలో భాగంగా తనకు వచ్చిన భవనాల్ని ఖాళీ చేసి తెలంగాణ రాష్ట్రానికి అప్పగిస్తే కానీ.. పని మొదలుకాదు. అదే తీరులో హైకోర్టు విభజన ముచ్చట కూడా. అందుకే.. బాబుతో పోలిస్తే.. కేసీఆర్ కు ‘విషయం’అర్థం కావటమేకాదు.. అవసరం కూడా ఎక్కువగా ఉండటంతో రాజీ చర్చలకు ఓకే అనటమే కాదు.. ఇష్యూలను త్వరితగతిన క్లోజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదేదో ముందే ఉండి ఉంటే.. ఈ పాటికి పరిష్కారాలు కూడా వచ్చేసి ఉండేవేమో..?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *