రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌ రావు సోమవారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. వైఎస్‌ జగన్‌ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు నివాసమైన ప్రగతి భవన్‌కు వెళతారు. అక్కడ వారిద్దరూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు – అప్పుల పంపకం, ఉద్యోగుల విభజన, ఇతర పెండింగ్‌ అంశాలు, జలవనరుల సద్వినియోగం, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించనున్నట్లు తెలిసింది.

నీటి వనరుల సమగ్ర సద్వినియోగంపై గతంలో రెండు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, సలహాదారులు, ముఖ్య కార్యదర్శులు హైదరాబాద్‌లో సమావేశమై చర్చించిన విషయం విదితమే. చర్చల కొనసాగింపులో భాగంగా కూడా వీరు సమావేశమై చర్చించారు. ఈ చర్చలన్నీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగిన నేపథ్యంలో సోమవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *