రివ్యూ: అనుష్క ‘భాగమతి’ మూవీ

కథ :
సెంట్రల్‌ మినిస్టర్ ఈశ్వర్‌ ప్రసాద్‌ (జయరామ్‌) నిజాయితీ గల రాజకీయనాయకుడు. ఆయనకు ఉన్న ఇమేజ్‌ చూసి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎలాగైన ఈశ్వర్ ప్రసాద్‌ ను కట్టడి చేయాలని భావిస్తారు. అందుకోసం ఎలాగైన ఈశ్వర్‌ ప్రసాద్‌ అవినీతి పరుడని నిరూపించాలని.. ఆ బాధ్యతను సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వైష్ణవి నటరాజన్‌(ఆశా శరత్)కు అప్పగిస్తారు. వైష్ణవి, ఈశ్వర్‌ ప్రసాద్ ను ఇరికించేందుకు ఆయన దగ్గర రెండు సార్లు సెక్రటరీగా పనిచేసిన చెంచలా ఐఏఎస్‌ (అనుష్క)ను విచారించాలని నిర్ణయించుకుంటుంది. తన ప్రియుడ్ని చంపిన కేసులో జైల్లో ఉన్న చెంచలను ప్రజల మధ్య విచారించటం కరెక్ట్ కాదని, ఊరికి దూరంగా అడవిలో ఉన్న భాగమతి బంగ్లాలో విచారించాలని నిర్ణయిస్తారు. బంగ్లాలోకి ఎంటర్‌ అయిన తరువాత చెంచల వింతగా ప్రవర్తిస్తుంది. తనను ఎవరో కొడుతున్నారని అరుస్తూ, అప్పుడప్పుడూ అరబిక్‌ భాషలో మాట్లాడుతూ పోలీసులను భయపెడుతుంది. చెంచల అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి..? మినిస్టర్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌ మీద మచ్చ వేయాలన్న కుట్ర ఎందుకు జరిగింది..? చెంచల తన ప్రియుడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది..? ఈ సమస్యల నుంచి చెంచల ఎలా బయటపడింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
అరుంధతి, రుద్రమదేవిగా చరిత్ర సృష్టించిన అనుష్క భాగమతిగా మరోసారి అదే స్థాయి పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఐఏఎస్‌ ఆఫీసర్‌ చెంచలగా హుందాగా కనిపించిన స్వీటీ, భాగమతిగా రౌద్ర రసాన్ని కూడా అద్భుతంగా పలికించింది. భాగమతి గెటప్‌ లో అనుష్క మరోసారి అరుంధతి సినిమాని గుర‍్తు చేసింది. మినిస్టర్‌ ఈశ్వర్‌ ప‍్రసాద్‌గా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో జయరామ్‌ నటన ఆకట్టుకుంటుంది. హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ ది చిన్న పాత్రే అయినా తనదైన హావ భావాలతో మెప్పించాడు . సీబీఐ జేడీ పాత్రలో ఆశా శరత్‌ నటన బాగానే ఉన్నా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న నటి కాకపోవటంతో అంతగా కనెక్ట్ కాలేదు. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, ధనరాజ్, విధ్యుల్లేఖ రామన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ :
గత ఏడాది చిత్రాంగద లాంటి థ‍్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక్‌ ఈ ఏడాది, అనుష్క లీడ్ రోల్‌ లో తెరకెక్కిన భాగమతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచే భారీ ప్రచారం లభించటంతో అదే స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఆ అంచనాలు అందుకునే స్థాయి భాగమతిని తీర్చి దిద్దాడు అశోక్‌. భారీ కథ కాకపోయినా.. అద్భుతమైన టేకింగ్‌, థ్రిల్లింగ్‌ విజువల్స్‌లో ఆడియన్స్‌ను కట్టి పడేశాడు. ముఖ్యంగా భాగమతి బంగ్లాలో జరిగే సన్నివేశాలు వావ్ అనిపిస్తాయి. ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చే ట్విస్ట్‌లు కూడా చాలానే ఉన్నాయి. ఒక దశలో అనుష్క విలనేమో అనేంతగా కథను మలుపు తిప్పాడు దర్శకుడు. అయితే ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్ పార్ట్‌ లు పార్ట్‌ లుగా రావటం. కొన్ని జరగని సంఘటనలు జరిగినట్టుగా భ్రమ కలిగించటంతో ఆడియన్స్‌ కాస్త తికమక పడే అవకాశం ఉంది. సినిమాకు మరో మేజర్‌ ప్లస్ పాయింట్‌ తమన్ మ్యూజిక్‌, తమన్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. మది సినిమాటోగ్రాఫి కూడా సినిమాను మరో మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్ధాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నేపథ్య సంగీతం
అనుష్క నటన

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ తికమక పెట్టే కథనం

తారాగణం : అనుష్క, ఉన్ని ముకుందన్‌, జయరామ్‌, ఆశా శరత్‌, మురళీ శర్మ
సంగీతం : తమన్‌.ఎస్‌
దర్శకత్వం : జి. అశోక్‌
నిర్మాత : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *