గోల్డెన్ గర్ల్ హిమ దాస్‌

అంతర్జాతీయ వేదికపై భారత మహిళా అథ్లెట్‌ హిమ దాస్‌ మూడు వారాల వ్యవధిలో ఐదో స్వర్ణాన్ని గెలిచి  శభాష్‌ అనిపించారు. చెక్‌ రిపబ్లిక్‌లో శనివారం జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌లో హిమ దాస్‌ 400 మీటర్ల రేసులో తొలి స్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకున్నారు. 200 మీటర్ల రేసులో నాలుగు స్వర్ణాలు సాధించిన హిమదాస్‌.. 400 మీటర్ల రేసులోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. భారత కీర్తిని మరింత పెంచిన హిమ దాస్‌ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. హిమ్‌దాస్‌ను చూసి దేశం గర్విస్తుందని, నెల వ్యవధిలోనే ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు దేశానికి అందించినందుకు అభినందనలు తెలిపారు. 19 ఏళ్ల స్ప్రింటర్‌ హిమదాస్‌కు భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందుల్కర్‌ కూడా అభినందనలు తెలియజేశారు. ‘గత 19 రోజులుగా యూరప్‌లో మీరు రాణించిన తీరు ఎంతో బాగుంది. గెలవడానికి మీరు పడే శ్రమ, పట్టుదల యువతకు ప్రేరణ కలిగిస్తుంది. ఐదు పతాకాలను సాధించినందుకు అభినందనలు. రాబోయే రేసుల్లో రాణించాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు. భారత యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో స్పందిస్తూ ‘ నీవే ఒక స్ఫూర్తి.  ద గోల్డెన్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా.. సలామ్‌ బాస్‌’ అంటూ కొనియాడాడు. హిమదాస్‌ పాంజ్‌సన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌, కుట్నో అథ్లెటిక్‌ మీట్‌, క్లాడ్నో అథ్లెటిక్‌ మీట్‌, టాబోర్‌ అథ్లెటిక్‌ మీట్‌, చెక్‌ రిపబ్లిక్‌ అథ్లెటిక్స మీట్‌లలో స్వర్ణాలను సాధించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *