చైనాలో ‘దంగల్‌’ రికార్డులే రికార్డులు

‘బాహుబలి’ ప్రభంజనం ఇంకా తగ్గనేలేదు.. కొత్తగా ‘దంగల్‌’ ప్రభంజనం షురూ అయ్యింది. ‘దంగల్‌’ సినిమా తాజాగా చైనాలో విడుదలై సంచలనాల్ని సృష్టిస్తోంది. నిన్నటికి ఈ సినిమా 121.73 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. చైనా వసూళ్ళతో కలుపుకుంటే, ‘దంగల్‌’ సైతం మొత్తంగా వెయ్యి కోట్ల వసూళ్ళు సాధించిన సినిమాల క్లబ్‌లో చేరేందుకు పరుగులుపెడ్తోందని చెప్పక తప్పదు. వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి భారతీయ సినిమాగా ‘బాహుబలి’ సరికొత్త రికార్డ్‌ సృష్టించిన విషయం విదితమే. ‘దంగల్‌’ చైనాలో ఇదే హవా కొనసాగిస్తే, ఆ క్లబ్‌లో చేరిన రెండో భారతీయ సినిమా అవుతుంది.

రెజ్లింగ్‌ పోటీల నేపథ్యంలో ‘దంగల్‌’ సినిమా తెరకెక్కిన విషయం విదితమే. ఇదే ప్యాటర్న్‌లో అంతకు ముందు సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘సుల్తాన్‌’ సినిమా తెరకెక్కి, ఘనవిజయాన్ని అందుకుంది. అయితే, ‘దంగల్‌’ సినిమాతో అమీర్‌ఖాన్‌ తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ సినిమా కోసమే అమీర్‌ఖాన్‌ భారీగా బరువు పెంచుకోవడం తెల్సిన విషయమే.

‘బాహుబలి’ వచ్చేవరకూ, అత్యధిక వసూళ్ళ రికార్డ్‌ ‘దంగల్‌’ పేరుతోనే వుండేది. ‘బాహుబలి’ రాకతో, ‘దంగల్‌’ రికార్డ్‌ బద్దలైపోయింది. ఇప్పుడీ చైనా వసూళ్ళతో ‘దంగల్‌’ మరోమారు వార్తల్లోకెక్కింది. ఇప్పటిదాకా చైనాలో, వంద కోట్ల మార్క్‌ టచ్‌ చేసిన భారతీయ చిత్రమేదీ లేకపోవడం గమనార్హం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *