రివ్యూ: ఊహించని ట్విస్ట్.. షాకింగ్ పెర్ఫార్మెన్స్…(దండుపాళ్యం-2 )

దాదాపు ఐదేళ్ల విచారణ అనంతరం దండుపాళ్యం గ్యాంగ్‌కు ఉరిశిక్ష విధిస్తారు. అనంతరం వారిని బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార జైలుకు తరలిస్తారు. అయితే ఈ కేసులో అభివిక్తి అనే మహిళా రిపోర్టర్‌కు అనేక అనుమానాలుంటాయి. 80 హత్య కేసుల్లో వీరిపై నేరం రుజువైనా….. కేవలం 12 కేసుల్లో మాత్రమే నేరాన్ని రుజువు చేసే సాక్ష్యాలుంటాయి. అవి కూడా బలమైన సాక్ష్యాలు కావు. ఇలాంటి కేసుల్లో అత్యంత కీలకమైన వేలిముద్రలు, వీర్య కణాలు, డీఎన్ఏ, హెయిర్ ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే 80 కేసుల్లో వీరిని దోషులుగా తేల్చడం ఏమిటి? అని అనుమాన పడిన సదరు రిపోర్ట్…… అసలు నిజాలు తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది.

ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో కొన్ని షాకింగ్ సాక్ష్యాలు అభివిక్తి దృష్టికి వస్తాయి. దీంతో ఆ గ్యాంగ్ ఏ తప్పూ చేయలేదని, పోలీసులు, మీడియా కలిసి వారిని నరహంతక గ్యాంగ్‌‌గా చిత్రీకరించారనే నిర్దారణకు వస్తుంది. తన ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా దండుపాళ్యం గ్యాంగ్‌ను పరప్పన అగ్రహార జైలు నుండి బెళగాం జైలుకు తరలిస్తారు. ఉరిశిక్ష అమలు చేయడానికి ఎలాంటి సదుపాయాలు లేని ఆ జైలుకు వారిని తరలించడంతో ఆమెకు అనుమానాలు మరింత బలపడతాయి. పోలీసులు ఏదో కుట్ర చేస్తున్నారని నమ్ముతుంది. స్పెషల్ పర్మిషన్ తీసుకుని వారిని జైల్లో కలిసి అసలు నిజం తెలుసుకోవాలని భావిస్తుంది. అయితే తమను కాపాడటానికి వచ్చిన ఆ రిపోర్టర్‌ను చంపడానికి ప్రయత్నిస్తుంది దండుపాళ్యం గ్యాంగ్. ఇదే ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంతకు మించి చెబితే మీకూ సినిమాపై ఇంట్రెస్టు పోతుంది. తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా ఎవరికీ వంక పెట్టడానికి లేదు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బొమ్మాళి రవిశంకర్ అదరగొట్టాడు. పోలీసులో విలనిజాన్ని చూపించి సూపర్బ్ అనిపించారు. బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు దండుపాళ్యం గ్యాంగ్ పాత్రల్లో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పడం బెటర్.

సాధారణంగా ‘దండుపాళ్యం’ సినిమా చూసిన వారంతా… పార్ట్ 2లో వారి జైలు జీవితం, జైలు నుండి తప్పించుకోవడానికి వారు ప్రయత్నించడం, ఈ క్రమంలో మరిన్ని దారుణాలకు పాల్పడతారని ఊహించుకుంటారు. కానీ థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి ఊహించని సినిమా చూపిస్తాడు దర్శకుడు.

దండుపాళ్యం 2 సినిమాతో ఈ నరహంతక ముఠా సినీ పర్వం ముగించలేదు. సినిమాను ఒక కీలకమైన స్థాయికి తీసుకెళ్లి అర్దాంతరంగా ముగించారు. దీంతో ప్రేక్షకుల్లో అసహనం ఒక్కసారిగా ఉబికి వస్తుంది. ఆగస్టు 2017లో దండుపాళ్యం పార్ట్ 3 ఉంటుందని, అప్పటి వరకు ప్రేక్షకులు ఓపిక పట్టాల్సిందే అంటూ బలవంతంగా థియేటర్ నుండి బయటకు పంపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.ఓవరాల్‌గా చెప్పాలంటే… పార్ట్ 1పై భారీ అంచనాలతో ఈ సినిమాకు వెళితే ప్రేక్షకుడు కాస్త నిరాశ పడక తప్పదు. ఇప్పటికే వచ్చిన పార్ట్-1….. త్వరలో రాబోతున్న పార్ట్-3కి మధ్య ఓ చిన్న లింకులా చాలా సాదా సీదాగా ఈ సినిమా ఉంది. లింకు మిస్సవ్వకుండా ఉండాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌
సంగీతం: అర్జున్‌ జన్య,
కో-డైరెక్టర్‌: రమేష్ చెంబేటి
నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌
నిర్మాత: వెంకట్‌
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *