వేతనం కోసం చాంతాడులా క్యూలు

ముంబై: పెద్ద నోట్ల రద్దు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులు వేతనాలు అందుకునే రోజు కావడంతో బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద గురువారం పెద్ద యెత్తున రద్దీ ఉండే అవకాశం ఉంది. ప్రజలు బారులు తీరి నగదు కోసం ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ వేతనాలు బ్యాంకుల్లో జమ కావడంతో వాటిని తీసుకోవడానికి ఉద్యోగులు బారులు తీరే అవకాశం ఉంది. అవసరాని కన్నా ఐదింతలు తక్కువగా నగదు బ్యాంకులకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఎటిఎంల్లో, బ్యాంకుల్లో నగదు నిల్వలు అడుగంటిపోయినట్లు తెలుస్తోంది. బుధవారం కూడా నగదు కోసం ప్రజలు ఎటిఎంల వద్ద, బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. సరినన్ని 500 రూపాయల నోట్లను రిజర్వ్ అందించకపోవడం కూడా నగదు కొరతకు కారణంగా భావిస్తున్నారు. డిమాండ్ మేరకు నగదును అందించడానికి గత కొద్ది రోజులుగా రిజర్వ్ బ్యాంకు ప్రయత్నాలు సాగిస్తోంది.

తగినన్ని 500 రూపాయల నోట్లు బ్యాంకులకు అందకపోవడం వల్ల, వంద రూపాయల నోట్ల సరఫరా తక్కువగా ఉండడం వల్ల, ప్రజలు రూ.2000 నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తుండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు వేతనాల సీజన్‌లో దేశవ్యాప్తంగా ఎటిఎంలకు అందించడానికి బ్యాంకులు రోజువారీ ప్రాతిపదికపై రూ.8 వేల కోట్ల నుంచి పది వేల కోట్ల వరకు సరఫరా చేసేవి. ప్రస్తుతం కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే అందుతున్నాయి. అది ఏ మాత్రం సరిపోదని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిని కూడా అందించలేని స్థితిలో ప్రైవేట్ బ్యాంకులు సొంతంగా నగదు విత్ డ్రాలపై పరిమితులు పెట్టాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. అయితే రిజర్వ్ బ్యాంకు విమర్శలను కొట్టి పారేస్తోంది. ప్రజలు ఇళ్లలో నగదును దాచుకోవడానికి ప్రయత్నించడం వల్ల సమస్య తీవ్రమవుతోందని అంటోంది. ఇది ఆగిపోతే తప్ప బ్యాంకుల్లో నిల్వలు ఉండవని అంటోంది. వచ్చే పది రోజుల పాటు పరిస్థితి దారుణంగా ఉంటుందని, ఉద్యోగులూ పింఛనుదార్లూ కార్మికులూ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులకూ ఎటిఎంలకూ దారులు తీస్తారని బ్యాంక్ సంఘాలు అంటున్నాయి. సాలరీ రష్‌ను దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంకు తగిన మొత్తాలను అందించకపోతే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం బుధవారంనాడు హెచ్చరించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *