జనవరి 1వ తేదీ నుంచి ఎగ్జిబిషన్

నాంపల్లి ;ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1వ తేదీ నుంచి నుమాయిష్‌ ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గతేడాది జరిగిన ఘోర అపశ్రుతి నేపథ్యంలో ఈసారి నుమాయిష్‌లో విద్యుత్ వైర్లను భూగర్భంలో నుంచి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారని చెప్పారు. హైదరాబాద్‌లో పారిశ్రామిక అభివృద్ధికి నుమాయిష్‌ ఉపయోగపడుతుందని అన్నారు. ఈసారి ఇందుకోసం రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏటా ఎగ్జిబిషన్‌ను సందర్శించేందుకు 20 లక్షల మంది వస్తున్నారని తెలిపారు. ఎగ్జిబిషన్ నేపథ్యంలో అదనపు మెట్రో రైలు సర్వీసులను నడపడానికి హెచ్‌ఎంఆర్‌ అంగీకరించిందని తెలిపారు.
ఏటా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే ‘అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన’ (నుమాయిష్)కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. నిజాం కాలం నుంచి నగరంలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఏటా జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయలకు ప్రతీకలైన సకల వస్తువులతో పాటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ వ్యాపార వేత్తలు ఇక్కడ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. కేవలం అగ్ని మాపక భద్రత కోసమే 40 మంది సిబ్బందిని నియమించినట్లు మంత్రి ఈటల వెల్లడించారు. సందర్శకులు సౌకర్యంగా షాపింగ్ చేసుకొనేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. రూ.3 కోట్లను ఫైర్ ప్రూఫ్ వ్యవస్థ కోసమే ఖర్చు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ వల్ల తలెత్తే అగ్ని ప్రమాదాలను 100 శాతం నిరోధించే వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘‘ఎగ్జిబిషన్ సొసైటీ కొన్ని వేలాది కుటుంబాలకు ఆశ్రయాన్నిస్తుంది. 30 వేల మంది విద్యార్థులకు మంచి విద్య అందించేందుకు సొసైటీ పని చేస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా జరిపే ఈ ఎగ్జిబిషన్‌ను ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసేలా మీకు హామీ ఇస్తున్నాం’’ అని మంత్రి ఈటల భరోసా ఇచ్చారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *