రివ్యూ: గుంటూరోడు

మంచు మనోజ్‌ వెండితెరపై మాస్‌ అవతారంలో కనిపించుండొచ్చు కానీ.. ఫక్తు మాస్‌ కథతో మాత్రం సినిమా చేయలేదు. అందుకే తనకి కొత్తగా ఉంటుందని ఈసారి ఓ పక్కా వాణిజ్య ప్రధానమైన కథని ఎంచుకొని ‘గుంటూరోడు’ చేశారు. పూరీ జగన్నాథ్‌ శిష్యుడైన ఎస్‌.కె. సత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాస్‌ మసాలా అంశాలతో కూడిన ప్రచార చిత్రాలతోపాటు, చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారనే కబురుతో విడుదలకి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిందీ సినిమా. మరి ఆ ఆసక్తికి తగ్గట్టుగానే ఉందా? చాలా రోజులుగా సరైన విజయం లేక సతమతమవుతున్న మనోజ్‌కి ‘గుంటూరోడు’తో వూరట కలిగినట్టేనా? తదితర విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

కథేంటి: గుంటూరు కుర్రాడు కన్నా(మంచు మనోజ్‌) వూళ్లొ అందరితోనూ గొడవలు పడుతున్నాడని, అతడికి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు తండ్రి సూర్యనారాయణ(రాజేంద్ర ప్రసాద్‌). పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు పక్కన ఉన్న అమ్మాయి అమృత(ప్రగ్యాజైశ్వాల్‌)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎమ్మెల్యే కావాలనుకున్న క్రిమినల్‌ లాయర్‌ శేషు(సంపత్‌రాజ్‌) చెల్లెలు అమృత. అహంకారి అయిన శేషుతో అనుకోకుండా కన్నాకి శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ శత్రుత్వం ఎందుకు?.. తనకు శత్రువైన కన్నాకి శేషు చెల్లిల్ని ఇచ్చి పెళ్లి చేశాడా?.. శేషు ఎమ్మెల్యే అయ్యాడా?.. తదితర విషయాలను తెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే?: సగటు కమర్షియల్‌ సినిమా ఇది. కథా కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. పాటలు, పోరాటాలు, లవ్‌ట్రాక్‌, హీరో-విలన్‌ మధ్య శత్రుత్వం వంటి అంశాలతో ఒక్క ఫార్ములా ప్రకారం సినిమా సాగిపోతుంది. కన్నా బాల్యాన్ని పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ మామూలే. తండ్రి-కొడుకు, అన్నా-చెల్లెలు వంటి బంధాలు.. ఆ నేపథ్యంలో సన్నివేశాలున్నా భావోద్వేగాలు మాత్రం పండవు. కామెడీ కూడా అంతంత మాత్రమే. కాకపోతే మనోజ్‌కే ఈ సినిమా కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి కథల్లో భావోద్వేగాలతో పాటు కామెడీ, ఉత్కంఠను రేకెత్తించే అంశాల్ని చూపించేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కానీ దర్శకుడు ఆ విషయాలపై దృష్టి పెట్టలేదు సరికదా ఒక పార్టీలో జరిగిన చిన్న గొడవ నేపథ్యంలోనే కథని తీర్చిదిద్దడం మరీ కృతకంగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో కూడా చిన్నప్పుడు స్కూల్‌ లీడర్‌ అయ్యే అవకాశాన్ని ఇచ్చాడని హీరో తండ్రికి రావు రమేశ్‌ సాయం చేసే వైనం కూడా సన్నివేశాలకు అతకలేదు అనిపిస్తుంది. విరామ ఘట్టానికి ముందు వచ్చే సన్నివేశాలు, మనోజ్‌ చేసిన పోరాట సన్నివేశాలు కాస్త ఆకట్టుకుంటాయి.

ఎవరెలా చేశారంటే?: మనోజ్‌ కమర్షియల్‌ కథలకు తగ్గ కథానాయకుడు అనిపించుకునేలా తన పాత్రలో ఒదిగిపోయారు. హుషారైన నటనతో, తన మార్కు ఫైట్లతో ఆకట్టుకున్నారు. సన్నివేశాలు పండలేదు కానీ, భావోద్వేగాల విషయంలోనూ మనోజ్‌ బాగా ప్రయత్నించారు. అహంకారం, పొగరు ఉన్న క్రిమినల్‌ పాత్రలో సంపత్‌ నటన పర్వాలేదు అనిపిస్తుంది. కోట శ్రీనివాసరావు తలపండిన రాజకీయ నాయకుడిగా తన పాత్ర పరిధి మేరకు నటించారు. పృథ్వీ, ప్రవీణ్‌, సత్య తదితర కామెడీ గ్యాంగ్‌ ఉన్నా.. పెద్దగా నవ్వించలేకపోయారు. వాళ్ల పాత్రలు తేలిపోయాయి. సాంకేతికంగా సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. సంగీతం, ఛాయాగ్రహణం బాగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ఎస్‌.కె. సత్య మాటలు, దర్శకత్వ తీరు అన్ని సర్వసాధారణంగానే అనిపిస్తాయి.

బలాలు
* నటీనటులు
* నిర్మాణ విలువలు
* విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు

బలహీనతలు
* సాదాసీదా కథ
* పతాక సన్నివేశాలు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *