ఐదున్నర కోట్లకు సినిమా కొని..

‘అర్జున్ రెడ్డి’ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.4.5 కోట్ల షేర్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా పెట్టుబడి ఎంత.. థియేట్రికల్ బిజినెస్ ఎంత చేసింది.. బయ్యర్లకు ఎంత అమ్మారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చిత్రం కేవలం రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కడం విశేషం.

పారితోషకాల విషయంలో పట్టుబట్టకుండా హీరో విజయ్ దేవరకొండ సహా చాలామంది ఈ సినిమాను తమ సినిమాగా భావించి చేయడం.. ఖర్చు ద్వారా కాకుండా తమ పని ద్వారా సినిమాకు రిచ్‌నెస్ తీసుకురావడంతో సినిమాకు రూ.2 కోట్లే ఖర్చయిందంటే నమ్మశక్యం కాదసలు.

ఇక ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ వాళ్లు విడుదలకు నెల రోజుల ముందే రూ.5.5 కోట్లకు హోల్ సేల్‌గా కొనేశారు. ఈ విషయంలో చిత్ర బృందం సూపర్ హ్యాపీ. ఇప్పుడు ఏషియన్ వాళ్ల ఆనందం గురించి చెప్పేదేముంది. పబ్లిసిటీ ఖర్చులతో కలిపి వాళ్లకు అయింది రూ.6 కోట్లు. ఇప్పుడీ సినిమా కేవలం రెండో రోజుకే బ్రేక్ ఈవెన్‌కు వచ్చేస్తోంది. ఫుల్ రన్లో రూ.30 కోట్ల షేర్ మార్కును అందుకున్నా ఆశ్చర్యమేమీ లేదు. అంటే పెట్టుబడి మీద ఐదు రెట్ల లాభం అన్నమాట. ఐతే కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకుని.. ఇంకొన్ని ఏరియాలకు అమ్మేశారు కాబట్టి మొత్తం లాభం వాళ్ల ఖాతాలోకే చేరదు.

ఐతే కనీసం పెట్టుబడి మీద మూడు రెట్ల ఆదాయం అయితే గ్యారెంటీ. మరోవైపు ఈ సినిమాను కొని రిలీజ్ చేసిన బయ్యర్ల పంటా పండినట్లే. కేవలం రూ.2 కోట్ల పెట్టుబడితో తీసిన సినిమా రూ.30 కోట్ల షేర్ వసూలు చేస్తే దీనికి ‘బ్లాక్ బస్టర్’ అనే మాట చిన్నదైపోదూ!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *