ప్రధానికి తనదైన సూచనలు చేసిన జేపీ

లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సుదీర్ఘ కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వివిధ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపిస్తున్న క్రమంలో తాజాగా జేపీ సైతం తన విశ్లేషణను వెల్లడించారు. అవినీతి నిర్మూలనపై విద్యార్థులు – ఎన్నికల నిపుణులు – పాత్రికేయులు పాల్గొన్న సదస్సుకు హాజరైన జేపీ తన అభిప్రాయాన్నివెల్లడించారు. నల్లధనం నిర్మూలనలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ  ప్రధానమంత్రి మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని జేపీ ప్రశంసించారు. ఈ నిర్ణయం దేశ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. అమలులో పలు సమస్యలు ఎదురైనప్పటికీ అంతా సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి జేపీ పలు సూచనలు చేశారు.  నల్లధనం ఎంత ప్రమాదకరమో – అవినీతి సైతం వ్యవస్థకు అంతే ప్రమాదకరమైనది విశ్లేషించారు. అందుకే బ్లాక్ మనీతో పాటు బ్యూరోక్రసీ అవినీతిపై సైతం దృష్టి సారించాలని ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి నిర్మూలనకు ఒక చట్టం తీసుకురావాలని జేపీ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం పన్నులు ఎగ్గొట్టేవారికి – అవినీతికి పాల్పడేవారికి చెంపపెట్టులాంటిదని జేపీ అన్నారు. కానీ మళ్లీ నల్లధనం సృష్టించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డబ్బులు ఉన్నవారందరూ అవినీతి పరులు కాదని… ఖర్చుల కోసం నగదు మార్పిడి చేసుకుంటున్న సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇచ్చే వారికి ఏడేళ్ల జైలుశిక్ష వేయిస్తున్న ప్రభుత్వం.. లంచం తీసుకుంటున్న అధికారులపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంపై జేపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. లంచాలు తీసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్న ఉద్యోగుల ఆస్తులను జప్తు చేయాలని జేపీ డిమాండ్ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *