రివ్యూ: ‘ఎంఎల్ఎ (మంచి లక్షణాలున్న అబ్బాయ్‌)‌’

అనంతపురం జిల్లా వీరభద్రపురంలో గాడప్ప (రవికిషన్), నాగప్ప (జయప్రకాశ్ రెడ్డి) కుటుంబాల మధ్య రాజకీయవైరం ఉంటుంది. ఎన్నో ఎలెక్షన్లలో నాగప్పపై, ఆయన కుటుంబంపై గాడప్ప గెలుస్తూనే ఉంటాడు. ఓ కారణం చేత ఆ నియోజకవర్గంలో గాడప్పపై కల్యాణ్ (కల్యాణ్ రామ్) రాజకీయ సవాల్ విసురుతాడు. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని విసిరిన కల్యాణ్‌ సవాల్‌కు గాడప్ప సై అంటాడు. రాజీనామా చేసిన గాడప్ప ఉపఎన్నికల్లో గెలిచాడా? ఎన్నో ఏళ్లుగా గెలుస్తున్న గాడప్పను ఎన్నికల్లో కల్యాణ్ ఏవిధంగా దెబ్బతీశాడు. తాను ప్రేమించిన ఇందు (కాజల్ అగర్వాల్)కు నాగప్ప కుటుంబంతో సంబంధమేమిటి? ఏ పరిస్థితుల్లో కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు కల్యాణ్ ఎలా చరమగీతం పాడాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఎంఎల్ఏ సినిమా కథ.

అమ్మాయికి ఆస్థులు పంచి ఇస్తే అవి ఉన్నంతకాలం బతుకుతారు.. అదే చదువు చెప్పిస్తే జీవితాంతం జీవిస్తారు అనే ఓ మంచి పాయింట్‌తో సినిమా తెరకెక్కింది. తొలి భాగంలో వీరభద్రపురంలో రాజకీయ ఫ్యాక్షన్‌తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత తన చెల్లెలు (లాస్య) ప్రేమించిన వ్యక్తి (వెన్నెల కిషోర్) పెళ్లి మరో అమ్మాయితో జరుగుతుంటే ఎత్తుకొచ్చే పెళ్లి సీన్‌తో హీరో కల్యాణ్ రామ్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా చెల్లెల్ని పెళ్లి చేయడం వల్ల కల్యాణ్ రామ్, చెల్లెలి కుటుంబంతో సహా బయటకు బెంగళూరుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కాజల్ అగర్వాల్‌తో పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత ఇందు ఓ సమస్యలో ఇరుక్కోవడంతో కథ ఇంటర్వెల్‌కు చేరి కొత్త మలుపుతిరుగుతుంది.

ఇంటర్వెల్‌లో తర్వాత ఇందు కోసం వీరభద్రపురం గ్రామానికి వెళ్లడం, అక్కడి పరిస్థితలు చూసి కల్యాణ్ రామ్ చలించడం సినిమా రెండోభాగంలో చకచకా సాగిపోతుంటాయి. ఇక ఇందును పెళ్లి చేసుకోవడానికి ఎంఎల్ఏ కావాలనే షరతుతో కథ ఇంకో మలుపు తిరుగుతుంది. అలా గాడప్ప వేసే ఎత్తులకు కల్యాణ్ ఎలా పై ఎత్తులు వేశారనే సినిమా ముగింపుకు సమాధానం.

విశ్లేషణ :
దర్శకుడిగా తొలి ప్రయత్నానికి ఉపేంద్ర మాధవ్‌ పక్కా ఫార్ములా కమర్షియల్ సినిమాను ఎంచుకున్నాడు. ఆరు పాటలు, నాలుగు ఫైట్ల కాన్సెప్ట్‌ తో రూపొందిన ఎంఎల్‌ఎతో నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌ హాఫ్ అంతా అసలు కథతో సంబంధం లేకుండా నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్‌ సమయానికి గాని కథలోకి ఎంటర్‌ కాలేదు. హీరో ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యేందుకు చేసే ప్రయత్నాలు ఇంకాస్త ఎలివేట్‌ చేసుంటే బాగుండేదనిపించింది. మణిశర్మ సంగీతం పరవాలేదు. పాటలు విజువల్‌ గా బాగున్నాయి. నేపథ్యం సంగీతంలో మణిశర్మ తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే సీన్స్‌ తో పాటు యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్‌, కాజల్‌
కామెడీ
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరి
బోర్‌ కొట్టించే కొన్ని సీన్స్‌

విడుదల తేదీ : మార్చి 23, 2018

 రేటింగ్ : 3/5

నటీనటులు : కళ్యాణ్ రామ్, కాజల్

దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్

నిర్మాత : భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి

సంగీతం : మణిశర్మ

సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మురెళ్ళ

ఎడిటర్ : తమ్మిరాజు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *