దాసరికి ఆ గౌరవం కల్పించిన కేసీఆర్

దర్శకరత్న దాసరి నారాయణరావు అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలోని దాసరి ఫాం హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దాసరి మృతికి కేసీఆర్ ఘనంగా నివాళి అర్పించారు. ‘‘సినీ రాజకీయ రంగాల్లో ఎంతో మందిని ప్రోత్సహించి.. వారి ఎదుగుదలకు కారణమైన ఆదర్శప్రాయుడు దాసరి. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడంలో దాసరి కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని కేసీఆర్ అన్నారు.

దాసరి అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరిగే అవకాశాలున్నాయి. దాసరి మృతి నేపథ్యంలో ఆయనకు గౌరవసూచకంగా సినీ పరిశ్రమలో మంగళవారం సాయంత్రం నుంచే అన్ని కార్యకలాపాలూ ఆగిపోయాయి. బుధవారం షూటింగులన్నీ ఆపేస్తున్నట్లు తెలుగు సినీ పరిశ్రమకే కాక.. టెలివిజన్ రంగం కూడా నిర్ణయం తీసుకున్నాయి. థియేటర్లలో కూడా సినిమాల ప్రదర్శన ఆపేయాలని పిలుపునిచ్చారు. పలు థియేటర్లు స్వచ్ఛందంగా దాసరికి నివాళిగా ప్రదర్శనలు ఆపేయాలని నిర్ణయించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగుని మూడు రోజుల పాటు నిలిపి వేయాలని నిర్ణయించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *